Begin typing your search above and press return to search.

రాజకీయాలకు అతీతం.. హోస్పేటలో అరుదైన దృశ్యం!

ఈ కార్యక్రమంతో దక్షిణాది రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పడిందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   25 Jun 2026 2:52 PM IST
రాజకీయాలకు అతీతం.. హోస్పేటలో అరుదైన దృశ్యం!
X

తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవ వేడుకలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని హోస్పేటలో గురువారం తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్లు అమర్చగా, వీటిని ప్రారంభించేందుకు కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముగ్గురు ముఖ్య నేతలు రాజకీయంగా భిన్నమైన వేదికలు పంచుకుంటున్నప్పటికీ, వారి మధ్య ఉన్న సానిహిత్యం కారణంగా ఈ అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాజకీయాలకు అతీతంగా..

ఈ కార్యక్రమంతో దక్షిణాది రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పడిందని అంటున్నారు. ఒకవైపు ఎన్డీయే మిత్రపక్షానికి చెందిన ఏపీ సీఎం చంద్రబాబు, మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణల నుంచి ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి ఒకే వేదికపైకి రావడం ఆకర్షించింది. జాతీయ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సహజమే అయినప్పటికీ, ఈ ముగ్గురు నేతలు మధ్య అటువంటి పరిస్థితి లేదు. మరోవైపు చంద్రబాబు-డీకే మధ్య చాలా కాలంగా స్నేహితులుగా చెబుతున్నారు. ఇక చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రత్యేకంగా వర్ణించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ అనుబంధం, అనురాగమే మంచి కార్యక్రమానికి బీజం వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.

గడ్డు కాలంలో బాబు చొరవ

గత ఏడాది తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు వరదలకు కొట్టుకుపోయినప్పుడు మూడు రాష్ట్రాల రైతాంగం తీవ్ర ఆందోళన చెందింది. ఆ సంక్షోభ సమయంలో కర్ణాటక పరిధిలో ప్రాజెక్టు ఉన్నప్పటికీ, ఏపీ సీఎం చంద్రబాబు చూపిన చొరవ, ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు యుద్ధప్రాతిపదికన తీసుకున్న నిర్ణయాలు నేడు ఈ కొత్త గేట్ల ఏర్పాటుకు పునాది వేశాయని అంటున్నారు. ఈ కృతజ్ఞతను చాటుతూనే, ప్రాజెక్టు పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషంగా చెబుతున్నారు.

జల వివాదాలకు ముగింపు!

తుంగభద్ర జలాలు మూడు రాష్ట్రాలకు జీవనాధారం. దశాబ్దాలుగా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ఈ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, రూ. 51 కోట్లతో చేపట్టిన ఈ 33 గేట్ల నిర్మాణం ప్రాజెక్టు భద్రతను పెంచడమే కాకుండా, మూడు రాష్ట్రాల మధ్య నమ్మకాన్ని విస్తృతం చేసిందని అంటున్నారు. రాజకీయంగా విభిన్న శిబిరాల్లో ఉన్నప్పటికీ, రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఈ నేతలు ప్రదర్శిస్తున్న సయోధ్య భవిష్యత్తులో జల వివాదాల శాశ్వత పరిష్కారానికి ఒక వారధిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.