రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు
విశాఖలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పీవీ తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా, తెలుగు సమాజానికి చెందిన గొప్ప నాయకుడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు జాతి వారసత్వం ఒక్కటేనని చాటిచెప్పారు.
By: A.N.Kumar | 12 Nov 2026 4:30 PM ISTమామూలుగా పగోడు అయితే మన అతడిని శత్రువులుగానే చూస్తాం. కింది స్థాయి నుంచి పై వరకూ ఇదే తంతు.. ఇక మన శత్రుపార్టీ అయితే ఆమడ దూరం పెట్టే నాయకులకు కొదవలేదు. కానీ చంద్రబాబు మాత్రం గౌరవించాడు. దేశానికి ప్రధానిగా చేసిన కాంగ్రెస్ నేత ఫొటోను అతడి ఖ్యాతిని ఇనుమడింపచేశారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు వారసత్వం ఒక్కటేనని చాటిచెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ప్రత్యేక గౌరవం కల్పించారు. తెలంగాణకు చెందిన నాయకుడైనా.. ఆయనను తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తిగా గుర్తుచేశారు. రాజకీయాలకు.. ప్రాంతీయ విభేదాలకు అతీతంగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఏర్పడిందే ప్రాంతీయతత్వం మీద.. ఎప్పుడూ ఏపీవారిని విమర్శిస్తూనే ఆ ప్రాంత నేతలు ఎదిగారనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం సాగినా అదంతా ముందుకు సాగలేదు. ఇప్పటికీ నీళ్లు ఇతర విషయాల్లో రాజకీయాల్లో ప్రాంతీయత, పార్టీల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి.
అయితే చంద్రబాబు మాత్రం తెలుగునేలపై విలసిల్లిన నేతలను గౌరవించడం విశేషం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాకుండా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.
విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ లో ప్రముఖ తెలుగు వ్యక్తుల చిత్రాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు చిత్రాన్ని కూడా అక్కడ ఏర్పాు చేయడం విశేషంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు వివరిస్తూ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. ‘పీవీ నరసింహరావు తెలంగాణకు చెందిన వ్యక్తి కావచ్చు. కానీ ఆయన తెలుగు సమాజానికి చెందిన గొప్ప నాయకుడని.. తెలుగు వారిగా ఆయనను గౌరవిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యాల్లో రాజకీయాల కంటే తెలుగు అస్తిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపించింది. భారత ప్రధానిగా పీవీ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారు. కీలక సంస్కరణలు చేశారు. 1991లో ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక దిశను మార్చాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన రాజకీయ గౌరవం దక్కలేదనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వ అధికారిక పెవిలియన్ లో పీవీ చిత్రాన్ని ప్రదర్శించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఒకనాయకుడి గొప్పతనాన్ని గుర్తించడానికి ఆయన ఏపార్టీకి చెందినవారన్నది ముఖ్యం కాదనే సందేశాన్ని చాటిచెప్పారు.
రాజకీయంగా ఎంతటి విభేదాలున్నా సరే.. చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తుల సేవలను గుర్తించడం ద్వారా చంద్రబాబు మరోసారి తెలుగు సమాజ చరిత్రను చాటిచెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి, గౌరవం విడిపోవని విశాఖ వేదికగా బలమైన సందేశం పంపారు.
