నియోజకవర్గాలకు 'ప్రోగ్రెస్ కార్డు' రెడీ ..!
ప్రొగ్రెస్ కార్డులను అందించాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను కేవలం టీడీపీకి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నారు.
By: Garuda Media | 6 Aug 2025 6:00 PM ISTఅధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డులు రెడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది అయిన నేపథ్యంలో వచ్చే నెలలో నియోజకవర్గాల వారీగా.. ప్రొగ్రెస్ కార్డులను అందించాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను కేవలం టీడీపీకి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ, జనసేనలు కూడా ముందుకు వస్తే.. అందరికీ కలిపి ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే.. దీనికి ఐదు అంచల్లో లక్ష్యాలను పెట్టుకున్నారు. వాటిని చేరుకున్న నియోజకవర్గాలకు ఏ+, మధ్యస్తంగా ఉన్నవాటికి ఏ, మరింతగా పనులు సాగాల్సిన నియోజకవర్గాలకు బీ ప్రాతిపదికన సర్టిఫికెట్లను అందించనున్నారు.
ఏంటా అంచనాలు..?
1) నియోజకవర్గంలో అభివృద్ధి: ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేసిన నియోజకవర్గాలు దీనిలో ఉంటాయి. రహదారుల నిర్మాణం ద్వారా.. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి.. వీటి ద్వారా ప్రజల సానుకూల పొందడాన్ని ప్రధానంగా దీనిలో చర్చిస్తారు.
2) సుపరిపాలన: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా .. ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేల గ్రాఫ్ ను పరిగణనలోకి తీసుకుంటారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా 132 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఒక్క కుప్పం, మంగళగిరిని మాత్రమే మినహాయించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అనుసరించిన ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తారు.
3) కూటమి కలివిడి: కూటమి పార్టీల నేతలను కలుపుకొని పోవడాన్ని కూడా ఒక ప్రాతిపదికగా.. నియోజకవర్గాలకు.. మార్కులు వేస్తున్నారు. దీనిపై ఎప్పటి నుంచో చంద్రబాబు నాయకులకు చెబుతున్నారు. కలివిడి ముఖ్యమని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కూడా మార్కులు వేయనున్నారు. తద్వారా ఎక్కడైనా పొరపొచ్చాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.
4) ప్రత్యర్థుల విమర్శలపై కౌంటర్: ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా ఆధారంగా కూడా.. నియోజకవర్గాలకు మార్కులు కేటాయించనున్నారు. చాలా వరకు నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల విషయంలో ఎమ్మెల్యేలు సైలెంట్‌గా ఉంటున్నారన్నది చంద్రబాబు చెబుతున్న మాట. ఇప్పుడు దీనిని కూడా నియోజకవర్గాలకు మార్కులు ఇచ్చే విషయంలో ప్రాతిపదికగా తీసుకుంటారు.
5) ఆరోపణలు: నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిని పరిహరించేందుకు కూడా ఈ ప్రోగ్రెస్ కార్డులు పనిచేయనున్నాయి. దీనికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి నుంచి వచ్చే మూడు మాసాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తయ్యాక.. ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుంటారని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు.
