Begin typing your search above and press return to search.

పిల్లలే సంపద -ఏపీలో కొత్త కార్యక్రమం

పిల్లలు ఉన్న ఇల్లు సిరి సంపదల లోగిలి అని పెద్దలు ఎనాడో చెప్పారు. గంపెడు పిల్లలతో తులతూగాలని కొత్త దంపతులను దీవించేవారు.

By:  Satya P   |   16 May 2026 11:41 PM IST
పిల్లలే సంపద -ఏపీలో కొత్త కార్యక్రమం
X

పిల్లలు ఉన్న ఇల్లు సిరి సంపదల లోగిలి అని పెద్దలు ఎనాడో చెప్పారు. గంపెడు పిల్లలతో తులతూగాలని కొత్త దంపతులను దీవించేవారు. ప్రతీ ఇంట్లో కనీసంగా అరడజన్ మందికి తక్కువ కాకుండా పిల్లలు ఉండేవారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత లాభం అన్నది పాత తరం గట్టిగా నమ్మింది. అయితే కాలం మారింది. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని ఒక స్లోగన్ వచ్చింది. మరో వైపు ఉమ్మడి కుటుంబాలు చితికిపోయాయి. దాంతో కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేశాయి. ఇక కుటుంబ నియంత్రణను ఒక ఉద్యమంగా ఏపీ లాంటి రాష్ట్రాలు చేశాయి. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అని పద్ధతులు గత తరాలు పాటించాయి. ఈనాటి తరం మరింతగా ముందుకు అడుగులు వేసి ఒక్క బిడ్డ ముద్దు అంటోంది. నవీన తరం అయితే పిల్లలు కాదు పెళ్ళే వద్దు అంటోంది. ఇలా కుటుంబ వ్యవస్థలో భారీ మార్పులు వచ్చేశాయి.

దార్శనీకుడిగా బాబు :

ఇక కుటుంబ సంక్షోభానికి ఈ పరిణామాలు అన్నీ దారి తీస్తున్నాయి. ఈ క్రమంలో ఇదే పరిస్థితి కొనసాగితే జనాభా అంతరించి మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుముఖం పట్టడం తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఈ నేపధ్యంలో దార్శనీకుడిగా పేరు ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే జనాభా పెరుగుదల విషయంలో సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన ఈ విషయంలో యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తున్నారు. ఫలితంగా ఏపీలో జనాభా పెరుగుదల విషయంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

భారీగా ప్రోత్సాహం :

ఏపీలో జనాభా పెరుగుదలకు ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుందని శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున చూస్తే దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోందని జనాభా తగ్గుదల రేటును అరికట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని బాబు చెప్పుకొచార్రు.

ఏపీలో చైతన్యం :

ఇక ఏపీలో ప్రజలలో చైతన్యం కోసం పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త కార్యక్రమం చేపడతామని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలో మూడో సంతానానికి 30 వేల రూపాయలు, నాలుగో సంతానానికి 40 వేల రూపాయలు ప్రోత్సాహకరంగా అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విశేషం. చాలామంది ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని ఈ కారణంగా చాలా దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్ధిక వ్యవస్థకు ముప్పు :

జనాభా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు అని బాబు అన్నారు. ఈ రోజున ప్రపంచంలో జనాభా తగ్గిన ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని బాబు గుర్తు చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ అమలుపై విస్తృతంగా పనిచేశామని ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా పిల్లలే సంపద అని పిలుపునిస్తున్నానని బాబు వివరించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా జననాల రేటును పెంచేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. అంతే కాకుండా స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఆంగన్వాడీ కేంద్రాలను కూడా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నామని బాబు వివరించారు. రానున్న కాలంలో ఈ మొత్తాలను కూడా ఆయన తెలిపారు. మొత్తం మీద ఏపీలో జనాభా పెరుగుదల అన్నది ఒక యజ్ఞంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ఫలితాలు తొందరలోనే ఏపీ చూస్తుందని సామాజిక వేత్తలు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.