బాబు ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రశ్నే లేదంతే !
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మీడియాలో ఊహాగానాలు రావడం ఎపుడూ జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి జాతీయ స్థాయిలో ఈ ప్రచారం ఎక్కువ అయింది.
By: Satya P | 27 Aug 2025 9:00 PM ISTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో మీడియాలో ఊహాగానాలు రావడం ఎపుడూ జరుగుతూ ఉంటుంది అయితే ఈసారి జాతీయ స్థాయిలో ఈ ప్రచారం ఎక్కువ అయింది. బాబు తాను మధ్యలోనే సీఎం పదవిని వదిలేసి తన కుమారుడు ప్రభుత్వంలో పార్టీలో అతి ముఖ్య భూమిక పోషిస్తున్న నారా లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తారు అన్న చర్చకు తాజాగా తెర లేచింది. అయితే జాతీయ స్థాయిలో ఈ వార్తలు రావడం కొంత విశేషంగా చూడాలి. అయితే ఎవరు ఏమనుకున్నా బాబు వ్యూహాలను ఆయన ఆలోచనలను అంచనా కట్టడంలో విఫలం అవుతున్నారు అని అనుకోవాలి.
అవన్నీ ఆయన రికార్డులే :
తెలుగుదేశం పార్టీకి గడచిన ముప్పయి ఏళ్ళుగా బాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇది పెద్ద రికార్డు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పద్నాలుగేళ్ళ పాటు మాత్రమే అధ్యక్ష స్థానంలో ఉన్నారు ఆ మీదట అంతా బాబు జమానాయే సాగుతోంది. ఇక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మొత్తం మూడు టెర్ములు నాలుగు ప్రమాణ స్వీకారాలు కలుపుకుని ఏడున్నరేళ్ళు మాత్రమే కొనసాగారు. అదే చంద్రబాబు నాలుగు ప్రమాణ స్వీకారాలు నాలుగు సార్లు సీఎం గా ఉంటూ ఏనాడో ఎన్టీఆర్ రికార్డుని అధిగమించారు. ఇప్పటికి అయితే బాబు సీఎం గా దాదాపుగా 16 ఏళ్ళ పాటుగా కొనసాగుతున్నారు. అంటే అన్న గారి రికార్డుకు రెట్టింపు అన్న మాట. ఇక తెలుగు సీఎంలు ఎవరూ సమీపంలో బాబు రికార్డుని అందుకోలేనంతగా ఆయన 2029 దాకా కొనసాగి ఒక సరికొత్త రికార్డు సృష్టించే ప్రయత్నంలో ఉన్నారని చెబుతారు.
బాబుదే ఆ క్రెడిట్ :
ఇక బాబు మరో అద్భుతమైన రికార్డుకు అతి సమీపంలో ఉన్నారు. బాబు 1978లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ అయిదేళ్ళ టెరంలోనే ఆయన మంత్రిగానూ పనిచేశారు ఇక 2028 నాటికి చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి యాభై ఏళ్ళు నిండుతాయి. పైగా సీఎం గా ఉంటూ అతి చురుకైన రాజకీయ నేతగా ఆయన ఉంటూండగా ఈ రికార్డు సొంతం అవుతుంది అని అంటున్నారు. బాబు తో పాటు 1978లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారు అంతా దాదాపుగా కనుమరుగు అయ్యారు. బాబు మాత్రం ఈ రోజుకీ తెలుగు నాట రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సైతం శాసించే విధంగా కొనసాగుతున్నారు. అందువల్ల బాబు అర్ధ శతాబ్దం రాజకీయ జీవితం అతి పెద్ద పండుగ తెలుగు నాట కానుంది. అంతే కాదు దేశ రాజకీయాల్లోనూ ఇంతటి సుదీర్ఘమైన పొలిటికల్ ఇన్నింగ్స్ ఎవరికీ బహుశా ఉండవేమో. అందువల్ల మరో మూడేళ్ళలో అంతటి అరుదైన రికార్డు సొంతం కాబోతుండగా బాబు సీఎం పదవికి రాజీనామా చేసి తప్పుకుంటారు అనుకుంటే పొరపాటే అని అంటున్నారు.
బాబు సారధ్యంలోనే :
ఇంకో వైపు చూస్తే ఏపీ సీఎం గా నాలుగవ సారి బాధ్యతలు వహిస్తున్న బాబు అమరావతి రాజధానిని పోలవరం ప్రాజెక్ట్ ని ఒక రూపు రేఖకలు తీసుకుని రావాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు. అందువల్ల ఈ టెర్మ్ బాబుకు చాలా ముఖ్యమైనది. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఇపుడు కీలక దశ కూడా ఇదే. ఈ రెండూ అనుకున్నట్లుగా సాధిస్తే బాబు చరిత్ర పుటలలో నిలిచిపోతారు. ఆ మీదట 2029 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ కూటమికి బాబు సారధ్యం వహిస్తారు అని అంటున్నారు. ఆ ఎన్నికల్లో కూటమిని తిరిగి గెలిపించుకున్న మీదటన బాబు అపుడు లోకేష్ కి పగ్గాలు అప్పగించే దిశగా ఆలోచించవచ్చు అని అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే కనుక ఏపీలో 40 శాతం ఓటు షేర్ తో వైసీపీ బలంగానే ఉంది బాబు ఈ మధ్యలో తప్పుకుంటే అది వైసీపీకి చాన్స్ ఇచ్చినట్లే అవుతుంది. అందువల్ల ఫైనల్స్ లోనే వైసీపీని రాజకీయంగా ఓడించి టీడీపీకి తిరుగులేని పరిస్థితిని తీసుకుని రావాలన్నది కూడా బాబు మార్క్ ఆలోచనలుగా చెబుతారు. ఏతా వాతా తేలేది ఏమిటి అంటే బాబు ఇప్పట్లో రిటైర్ అయ్యేది ఉండదని. సో ఆయన మీద వచ్చే ఏ వార్తలు అయినా పుకార్లుగానూ ఊహాగానాలుగానూ చూడాల్సిందే అని అంటున్నారు.
