ప్రధాని మోదీ బిగ్ టాస్క్.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకి కీలక బాధ్యతలు
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తోంది.
By: Tupaki Political Desk | 24 March 2026 4:00 PM ISTఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్న ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పెద్ద భారమే మోపారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరినీ రెండు రాష్ట్రాలను అప్పగించి ఆ రాష్ట్రాల్లో ఎన్డీఏను గెలిపించాలనే టాస్క్ అప్పగించారని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు, పవన్ తో చేతులు కలిపిన బీజేపీ కేంద్రంలోనూ అధికారం నిలబెట్టుకుంది. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీకి అందని ద్రాక్షగా ఊరిస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నవ చరిత్ర లిఖించేందుకు ప్రధాని మోదీ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు.
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తోంది. ఈ రెండు పెద్దరాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ప్రధాని మోదీ పట్టుదల ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో మూడు చోట్ల పరిస్థితి ఎన్డీఏకి అనుకూలంగా లేదని ఓపీనియన్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అప్రమత్తయ్యారని అంటున్నారు. దీంతో హిట్ పెయిర్ గా పేరు గడించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సేవలను సమర్థంగా వాడుకోవాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు వ్యూహరచన, పవన్ సినీ గ్లామర్ ఎన్నికల్లో పనిచేస్తుందని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారని అంటున్నారు. దీంతో ఇద్దరికి రెండు కీలక రాష్ట్రాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. పశ్చిమ బెంగల్ లో కోల్ కతా, ఖరగ్ పూర్ నగరాల్లో తెలుగు వారు కూడా ఎక్కువగా నివసిస్తుంటారు. ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలస వెళ్లిన వారే ఆ రెండు నగరాల్లో నివసిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట కావడంతో ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా చంద్రబాబుకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. అంతేకాకుడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాలకు దీటుగా చంద్రబాబు పనిచేయగలరని బీజేపీ అగ్ర నాయకత్వం యోచిస్తోందని చెబుతున్నారు.
అదేవిధంగా పవన్ సినీ గ్లామర్ ఉపయోగించుకుని తమిళనాడులో లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో సినీ గ్లామర్ ఎక్కువగా పనిచేస్తుందని గతంలో జరిగిన అనేక ఎన్నికలు రుజువు చేశాయి. ప్రస్తుతం పోటీ పడుతున్న అధికార డీఎంకే కూటమికి డిప్యూటీ సీఎం ఉదయనిధికి సినీ రంగంతో అనుబంధం ఉంది. ఈ కూటమికి సీనియర్ నటుడు కమలహాసన్ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అదేవిధంగా కొత్తగాపార్టీ పెట్టిన ప్రముఖ హీరో విజయ్ సైతం ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కూటమి కోసం పవన్ ను ఉపయోగించుకోవాలని బీజేపీ అగ్రనాయత్వం ప్లాన్ చేసిందని అంటున్నారు.
గతంలో మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో పవన్, చంద్రబాబు ప్రచారం చేశారు. ఆయా ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. దీంతో ఈ సారి కూడా చంద్రబాబు, పవన్ సేవలను వాడుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజకీయంగా కంట్లో నలుసులా మారిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను గద్దె దించాలని, బీజేపీ పాలనను మరింత విస్తరించాలని ప్రధాని కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. ఇక ప్రధాని మోదీ మోపిన ఈ బాధ్యతలను పవన్, చంద్రబాబు ఎంతవరకు నెరవేర్చగలరనేది ఉత్కంఠ రేపుతోంది.
