వందకు వంద కూటమికే...బాబు పవన్ టార్గెట్ !
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉంటుందో 2024 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
By: Satya P | 6 Oct 2026 3:07 PM ISTచంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలా ఉంటుందో 2024 ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పవన్ చరిష్మా బాబు అనుభవం కలిసి బిగ్ సౌండ్ చేశాయి. ఏపీ రాజకీయాలను తిరగ రాశాయి. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా 95 శాతం సీటు షేర్ తో ఒక రాజకీయ అద్భుతాన్ని సృష్టించాయి. మళ్లీ రెండేళ్ళ తరువాత ఆ అద్భుతాన్ని రిపీట్ చేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇది నిర్ణయం మాత్రమే కాదు గట్టి పట్టుదల అని చెప్పాల్సి ఉంది. వైసీపీకి ఆ మిగిలిన 5 శాతం సీటు షేర్ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కకుండా చేయాలని ప్రతిన పూనాయి. చంద్రబాబు పవన్ ల మధ్య జరిగిన స్థానిక ఎన్నికల గురించిన చర్చ అయితే ఏపీలో వైసీపీకి నో చాన్స్ అంటూ చెక్ పెట్టేలా సాగింది అని అంటున్నారు.
ఒక్క సీటూ రాకుండా :
ఏపీలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాటపడుతోంది. అయితే వైసీపీకి ఒక్క సీటు కూడా రానీయకుండా చేయాలని కూటమి గట్టి పంతం మీద ఉంది. కూటమి ఐక్యంగా ముందుకు సాగితే అది సాధ్యమే అని కూడా అంటున్నారు. కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు వాటి నాయకులు క్యాడర్ అంతా కూడితే కనుక వైసీపీని ఈజీగానే ఢీ కొడతారని అంటున్నారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షానికే మొగ్గు ఉంటుంది. మరో సగం పాలన అంతా అధికార కూటమి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి జనాలు కూడా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కూటమికే ఓటేస్తారు. దాంతో పాటు కూటమి రాజకీయ వ్యూహాలు కూడా తోడు అయితే కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ పొలిటికల్ హిట్ గా చంద్రబాబు పవన్ ల కాంబో నిలిచి పోతుందని అంటున్నారు.
ఉత్కంఠకు తెర :
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గురించిన వార్తలు మొదలైన దగ్గర నుంచి టీడీపీ జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది, ఏ విధంగా ముందుకు సాగుతారు అన్నది చర్చకు వస్తూనే ఉంది. ఎందుకంటే జనసేన ఈసారి ముప్పయి శాతానికి తక్కువ లేకుండా సీట్లు తీసుకోవాలని అనుకుంది. దాంతో జనసేన ఏ విధంగా కోరబోతోంది, టీడీపీ రియాక్షన్ ఏమిటి అన్నది అయితే ఆ రెండు పార్టీలలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనే ఉత్కంఠగా మారింది. ఇక మంగళవారం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు సాగింది. అంతా సాఫీగానే సాగింది అని అంటున్నారు. ఇక బాబు ఇంటికి వచ్చిన పవన్ కి మంత్రి నారా లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు.
బలమున్న చోట పోటీ :
స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం గురించి నిర్వహించిన సమావేశంలో భాగంగా సీట్ల సర్దుబాటు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. పార్టీలతో కాదు కూటమిగా ముందుకు పోవాలని నిర్ణయించారు అని అంటున్నారు. బలం ఉన్న చోట పోటీకి మిత్రులు దిగాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు అని అంటున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ చర్చ జరిగింది అని భోగట్టా. అలాగే టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయానికి కమిటీ ఏర్పాటుకు యోచన చేయడంతో పాటు బలమున్న చోట మిత్రపక్షాలు పోటీ చేసేలా బాబు పవన్ అంగీకారానికి వచ్చారని చెబుతున్నారు.
సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ :
ఎవరు ఎక్కడ పోటీ చేశారన్నది ముఖ్యం కాదు, సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడమే ముఖ్యమని కూటమి పార్టీలు తీర్మానించాయని చెబుతున్నారు. అందుకే టీడీపీ-జనసేన మధ్య సమన్వయం కోసం జాయింట్ మెకానిజం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ విధంగా కూటమి ఐక్యతపై క్యాడర్‌కి స్పష్టమైన సందేశం ఇవ్వాలని సైతం నిర్ణయించారని అంటున్నారు. మొత్తానికి కూటమి పూర్తి బలంతో అంతకంటే ఐక్యతతో ముందుకు వస్తోంది. మరి కూటమిని ఢీ కొట్టేందుకు వైసీపీ ఏ విధంగా వ్యూహ రచన చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
