Begin typing your search above and press return to search.

బాబు పవన్ మరింత కలసికట్టుగా !

కూటమిలో రెండు పార్టీల క్యాడర్ నుంచి మొదలెట్టి లీడర్ల దాకా అంతా కలసికట్టుగా ఉండాలని టీడీపీ జనసేన అధినాయకత్వం కోరుతూనే వస్తోంది.

By:  Satya P   |   4 March 2026 9:22 AM IST
బాబు పవన్ మరింత కలసికట్టుగా !
X

ఏపీలో టీడీపీ కూటమిలో తెలుగుదేశం జనసేన కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీల అధినేతలు అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మధ్య మంచి సాన్నిహిత్యం అవగాహన ఉన్నాయి. ఇద్దరూ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒకే మాటగా ఉంటారు. అంతే కాదు కూటమి ప్రభుత్వాన్ని పదిహేనేళ్ళ పాటు కొనసాగించాలని కూడా ఈ ఇద్దరూ పట్టుదలగా ఉన్నారు. అదే విషయం జనాలకు కూడా చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఏపీ ముందుకు సాగే విషయంలో కచ్చితంగా కూటమి ప్రభుత్వమే మరో మూడు టెర్ములు కొనసాగాలని ఈ ఇద్దరు నేతలు పిలుపు ఇస్తున్నారు.

క్యాడర్ నుంచి మొదలెట్టి :

కూటమిలో రెండు పార్టీల క్యాడర్ నుంచి మొదలెట్టి లీడర్ల దాకా అంతా కలసికట్టుగా ఉండాలని టీడీపీ జనసేన అధినాయకత్వం కోరుతూనే వస్తోంది. ఏ ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూర్చుని సర్దుబాటు చేసుకోవాలని చెబుతోంది. అలకలు అసంతృప్తులు సహజం అని వాటిని పెద్దవి చేసుకోకుండా సజావుగా పరిష్కారం చేసుకోవాలని కూడా కోరుతోంది.

తాజా మంతనాల వేళ :

ఇదిలా ఉంటే తాజాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఈ ఇద్దరి భేటీ ఏకంగా రెండు గంటలకు పైగా సాగింది. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాల నుంచి రాజకీయ అంశాల దాకా చర్చకు వచ్చాయని చెబుతున్నారు. ఏపీలో విపక్ష వైసీపీ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం మీద కూడా చర్చ సాగింది అని అంటున్నారు. మరింత దూకుడుగా కూటమి ప్రభుత్వం పార్టీలు వైసీపీ రాజకీయాల మీద పోరు సాగించాలని కూడా చర్చించారని అంటున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలో :

ఏపీలో నామినేటెడ్ పదవులు మరిన్ని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. అలాగే తొందరలోనే రాజ్యసభ సీట్లకు నాలుగు ఖాళీలు ఏర్పడుతున్నాయి. దాంతో వీటి మీద కూడా చర్చ సాగింది అని అంటున్నారు. టీడీపీకి రెండు బీజేపీ జనసేనకు చెరి ఒకటి అన్నది అయితే వినిపిస్తున్న మాట. మరి ఈ సీట్ల విషయంలో ఎంతో మంది ఆశావహులు ఉన్నారు. అయితే ఎవరిని నామినేట్ చేయాలన్నది ఇదమిద్దంగా చర్చించారా అన్నది తెలియడం లేదు కానీ రాజ్యసభకు కూటమి పార్టీల నుంచి సీట్ల పంపకాల విషయంలో అయితే పెద్దగా పేచీ పూచీలు లేకుండానే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

ముగియనున్న అసెంబ్లీ సెషన్ :

ఇక అసెంబ్లీ సెషన్ ఈ నెల 7వ తేదీతో ముగియనుంది. దాంతో ఈ సమావేశాలలో చేపట్టాల్సిన వ్యూహం మీద కూడా చర్చించారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఏపీ రాజకీయాల్లో వైసీపీ కూటమి ని గట్టిగా సవాల్ చేస్తోంది. ప్రతీ అంశాన్ని రాజకీయంగా పీక్స్ కి చేర్చే ప్రయత్నం అయితే సాగిస్తోంది. దానిని ధీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే కూటమి మీద కచ్చితంగా ఉంది. ఈ నేపధ్యంలోనే బాబు పవన్ భేటీ సాగడం ఆసక్తికరమైన పరిణామమే అని అంటున్నారు. కూటమి బలంగా పటిష్టంగా ఉందని మిత్రుల మధ్య సయోధ్య సైతం గట్టిగా ఉంది అన్న సందేశాన్ని అయితే తాజా భేటీ ఇచ్చింది అని అంటున్నారు.