బాబు-పవన్‌లు చాన్స్ మిస్ చేసుకుంటున్నారా?
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం చిక్కింది. కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి.. రావాల్సిన వాటిని కూడా దక్కించుకునేందుకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది.
By: Garuda Media | 1 Sept 2025 8:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం చిక్కింది. కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి.. రావాల్సిన వాటిని కూడా దక్కించుకునేందుకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది. దీనిలో కేంద్రంతో గొడవ పడాల్సిన అవసరం కానీ.. కేంద్రాన్ని ధిక్కరించాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతోంది. కీలకమైన ఓటు బ్యాంకు ఏపీలోనే ఉంది. మొత్తం 18 మంది కూటమి ఎంపీలు ఉన్నారు. వీరి ఓటు బ్యాంకు ఉపరాష్ట్రపతి పోరులో బీజేపీకి కీలకం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీకి వెళ్లి కూర్చొనైనా.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులను సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుపై క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధం గా అమరావతికి నిధులను మరిన్ని తెచ్చుకునేందుకు ఒత్తిడి చేసే అవకాశం కూడా ఇప్పుడే చిక్కింది. ఇది బెదిరింపు కాదు.. మోడీ సర్కారును గద్దె దించేయడం కూడా కాదు. ఉదాహరణకు.. బీహార్.. సీఎం నితీష్‌కుమార్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 14 మంది ఎంపీల మద్దతు ఇస్తున్నారు.
అయితే.. ఇప్పటికే ఆయన మోడీకి లేఖ రాశారు. విదర్భను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయన కోరారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల్లో వాటాలను విక్రయించరాదని కూడా చెప్పారు. అలానే.. పట్నాలో నిర్మిస్తున్న ఏఐ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. వీటికి దాదాపు మోడీ అంగీకరించారు. అంతేకాదు.. నితీష్‌కుమార్.. ఢిల్లీ పర్యటన కూడా పెట్టుకున్నారు. త్వరలోనే ఆయన మోడీని కలిసి తన కోరికలకు ఆమోద ముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
అలాంటప్పుడు.. నితీష్ కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఉండి.. కేంద్రానికి మద్దతు ఇస్తున్న.. కూటమి.. ఆ మాత్రం ప్రయత్నం చేస్తే తప్పులేదు. పైగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇది అవసరం కూడా. సో.. ఈ దిశగా అడుగులు వేస్తే.. రాష్ట్రానికి మేలు చేయడంతోపాటు.. కేంద్రం కూడా దిగి వచ్చే అవకాషశం ఇప్పుడే ఉంది. గత రెండు ప్రభుత్వాల్లో 2014, 2019లో మోడీకి సరిపోయినంత బలం ఉంది. కాబట్టి.. అప్పట్లో సాధ్యం కాలేదు. కానీ, ఇప్పుడు మోడీకి బాబు, పవన్ల మద్దతు కీలకం. ఈ నేపథ్యంలో ఆయన జోక్యం చేసుకుని.. పరిష్కారానికి ప్రయత్నించే అవకాశం ఉందని మేధావులు చెబుతున్నారు.
