బాబు పవన్ సుదీర్ఘ భేటీ...డిస్కషన్ పాయింట్స్ అవేనా ?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు.
By: Satya P | 29 Sept 2025 9:09 AM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఆయన బిజీగా సినీ రాజకీయ కర్యక్రమాలలో పాలు పంచుకోవడంతో బాగా అలసిపోయారు దాంతో వైద్యుల సలహాతో వైరల్ ఫీవర్ వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ లో ఉన్న పవన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం కలసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
కోలుకోవాలని కోరుతూ :
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం విషయంలో చంద్రబాబు కొన్ని సూచనలు చేశారని చెబుతున్నారు. తొందరగా కోలుకోవాలని కూడా సూచించారు. అదే సమయంలో ఇద్దరు నేతలు గంటకు పైగా అనేక అంశాల మీద చర్చించారు అని చెబుతున్నారు. ఏపీలో అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఆటో డ్రైవర్ల కోసం చేపట్టే ఈ పథకం కూడా మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉన్నట్లుగా చంద్రబాబుతో పవన్ చెప్పారు.
ప్రధాని మోడీ సభ గురించి :
అదే విధంగా జీఎస్టీ 2.0 సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహణపైనా ఇద్దరు నాయకులూ చర్చించారు. ఇక అక్టోబర్ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా ఆ రోజున జరిగే రోడ్ షో ని విజయవంతం చేసే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వీటితో పాటుగా మెగా డీఎస్సీ అంశం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి దాదాపుగా పదహారు వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
తాజా రాజకీయ పరిస్థితుల పైన :
ఇదిలా ఉంటే గంటకు పైగా సాగిన ఈ భేటీలో ఇద్దరు నేతలూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు అని అంటున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఈ మధ్య జరిగిన పరిణామాలు కచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. అదే విధంగా కూటమి పార్టీల మధ్య ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ భేటీ సాగిందని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు పవన్ ఆరోగ్యం విషయంలో పరామర్శ చేయడం ద్వారా ఏపీలో గత కొద్ది రోజులుగా ఉన్న వేడి వాతావరణాన్ని ఎంతో కొంత చల్లార్చే ఉంటారని భావిస్తున్నారు. బాలయ్య వర్సెస్ చిరంజీవిగా మారిన సోషల్ మీడియా వార్ కి ఈ భేటీ ఒక జవాబు గా ఉంటుందని అంటున్నారు. చూడాలి రానున్న రోజులలో ఈ భేటీ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో.
