మేధావుల మాట: బాబు ప్రభుత్వం చేస్తోంది తప్పా ..!
ఈ వ్యూహంతోనే చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.
By: Garuda Media | 13 Aug 2025 10:00 AM ISTరెండు కీలక విషయంపై ప్రస్తుతం చంద్రబాబు సర్కారును ప్రశ్నిస్తూ.. అనుకూల మీడియాలో వచ్చిన కథనాలపై మేధావి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోను.. ఆన్‌లైన్ చానెళ్లలోనూ.. అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. పీ-4 సహా రాజధాని అమరావతి భూముల వ్యవహారంపై గత ఆరుమాసాల నుంచి చర్చ ఉంది. అయితే.. వీటిని ఎవరూ తప్పుబట్టడం లేదు. నిజానికి అన్నీ ప్రభుత్వం చేయాలంటే కుదిరే పనికాదు. అందరూ కలిసి చేతులు కలిపితే సమాజాన్ని మార్చొచ్చు.
ఈ వ్యూహంతోనే చంద్రబాబు పీ-4 కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సక్సెస్ అవుతాయి.. కొన్ని నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటాయి. ఈ విషయాన్ని యాగీ చేయా ల్సిన అవసరం లేదని భావించే ప్రతిపక్షం వైసీపీ నాయకులు కూడా పీ-4పై పెద్దగా విమర్శలు చేయడం లేదు. సమాజంలోని ధనవంతులను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా.. వారి నుంచి పేద కుటుంబాల ను ఆదుకునేలా చేయాలన్నది చంద్రబాబు సంకల్పం.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కూడా.. కార్పొరేట్ రెస్పాన్స్ కింద ధనిక పారిశ్రామిక వేత్తలపై పన్నులు వే స్తోంది. అదేవిధంగా స్వచ్ఛందంగా వారే పనులు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఇదే ఫార్ములాను చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారు. అయితే.. కేంద్రం మాదిరిగా ఎవరినీ ఒత్తిడికి గురి చేయడం లేదు. పారిశ్రామిక వేత్తలను ఒకరకంగా తన స్థాయిలో బుజ్జగిస్తున్నారు. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని.. మెజారిటీ మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక, 2029 నాటికి పేదరికం మొత్తం పోవాలని చంద్రబాబు అంటున్నా.. అది సాధ్యం కాదన్న వాదన కూడా తప్పని అంటున్నారు.
కొంతలో కొంత తగ్గినా.. అది మంచిదేనని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ``చంద్రబాబుఏదో చేస్తున్నారు. చేయనిద్దాం. మనం ఎందుకు అడ్డు పడడం`` అని కీలక ప్రొఫెసర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, అమరావతిలో రైతులకు భూములు ఇచ్చే విషయంపైనా యాగీ చేయడం సరికాదని అంటున్నారు. ఈ విషయంలో రైతులకు ఉన్న పరిజ్ఞానాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచే వారు భూములు ఇచ్చారని.. సర్కారు కూడా అనేక చిక్కులు దాటుకుని వస్తున్న క్రమంలో ఇప్పటికిప్పుడు యాగీ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేయడం తప్ప.. మరో విషయం లేదని అంటున్నారు. మొత్తానికి ఈ రెండు విషయాల్లో సర్కారు చేస్తున్న పనిని మేధావి వర్గాలు సమర్థిస్తుండడం గమనార్హం.
