బాబు చెబుతున్నది రైతులు అర్థం చేసుకుంటున్నారా ?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొంతకాలంగా రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రైతాంగం మేలు కోరుతూనే ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన సూచనలు చేస్తున్నారు.
By: Satya P | 7 Nov 2025 9:21 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొంతకాలంగా రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రైతాంగం మేలు కోరుతూనే ప్రజల ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన సూచనలు చేస్తున్నారు. కేవలం అధిక దిగుబడి మాత్రమే లక్ష్యం కాకుండా ఇతర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. నిజానికి వ్యవసాయ పద్ధతులు చాలా కాలంగా మారిపోయాయి. రసాయన ఎరువులు వాడుతున్నారు. అది అవసరం అనివార్యం అని అంటున్నారు. అయితే పండించిన పంట మార్కెట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అందరికీ అవసరం అయిన రసాయన ఎరువులు సరఫరాలో తేడా వస్తే రైతులు ఆందోళన చేస్తున్నారు.
సేంద్రియ విధానం :
రైతులు తమ పంటలలో సేంద్రీయ ఎరువులు వాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సభలు సమావేశాలలో చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన ఆచార్య ఎన్ జీ రంగా జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మరోసారి ఇదే విధమైన హిత బోధ చేశారు. రైతులు సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పంటలకు సేంద్రీయ ఎరువులను మాత్రమే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
కొన్ని దేశాలు నో :
ఏపీ నుంచి ఇతర దేశాలకు పంటలు ఎగుమతి చేయాలంటే వారు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని చంద్రబాబు కీలక అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మనం పండించిన పంటలను కొన్ని దేశాలు దిగుమతి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు అని ఆయన చెప్పుకొచ్చాఉర్. అందుకు కారణం రసాయన ఎరువుల వాడకమే అని ఆయన అసలు విషయం చెప్పారు. అందువల్ల రైతులు సేంద్రియ విధానంలోకి మారాలని ఆయన సూచించరు. అంతే కాదు మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్భోదించారు.
రైతుల పక్షమే :
ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల పక్షమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని చెప్పారు. అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీని కూడా ఇస్తున్నామని, మిగిలిన వారికి 50 నుంచి 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని ఆయన వివరించారు. కౌలు రైతులు అధైర్య పడొద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని బాబు కోరారు. వారిని కూడా కూటమి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని బాబు వెల్లడించారు.
సీమలో కొత్త సీన్ :
ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరవు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాదాపుగా దానిని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. సమర్థ నీటి నిర్వహణతో పాటు, ముందస్తు చర్యల వల్ల రిజర్వాయర్లు 95 శాతం నిండాయని బాబు చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో రిజర్వాయర్ల గేట్లను కూడా నిర్వహించలేకపోయారని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ స్పూర్తితో జలాశయాలను పూర్తిచేశామని చెప్పారు అలాగే రాయలసీమలో కరువును జయించామని వెల్లడించారు.
