వీరికి వెయింట్ తప్పదు.. బాబు సిగ్నల్స్!
ఏపీలో మంత్రివర్గ కూర్పు చేర్పులపై చంద్రబాబు తాజాగా సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.
By: Garuda Media | 6 Sept 2025 9:36 AM ISTఏపీలో మంత్రివర్గ కూర్పు చేర్పులపై చంద్రబాబు తాజాగా సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పట్లో మంత్రివర్గాన్ని మార్చే పరిస్థితి లేదని ఆయన పలువురు కీలక నేతలకు స్పష్టం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఉగాది నుంచి మంత్రివర్గ మార్పుపై అనేక చర్చలు తెరమీదకు వచ్చాయి. జనసేన పార్టీ నుంచి నాగబాబుని, టిడిపిలో మరో ఇద్దరు సీనియర్ నాయకులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అయితే, అనూహ్యంగా ఇది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.
దీనిపై తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ కీలక నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటికిప్పుడు మార్పులు ఉండవని.. మరో ఏడాది ఎదురుచూడక తప్పదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. నిజానికి గత ఎన్నికల సమయంలో.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాన్ని త్యాగం చేసి సైకిల్ ఎక్కారు. ఆ సమయంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న హామీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది.
అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని నాయకులు చెబుతూ వచ్చారు. మొత్తంగా ముగ్గురి నుంచి నలుగురు వరకు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తారని అనుకున్నారు. కానీ, ఇది ఇప్పటిలో సాధ్యం కాదని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు మార్పులు దిశగా అడుగులు వేస్తే చెడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని చంద్రబాబు తేల్చేసినట్టు తాజా సమాచారం.
ఒకరిద్దరు మంత్రులపై చంద్రబాబుకు అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తం అవుతుండడం... అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని మార్పు చేస్తే దానిపై చర్చ దారిమళ్లుతుందని, ఇది ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు, పాలనుకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ క్రమంలోనే మంత్రివర్గ కూర్పు విషయంలో ఆయన మరింత ఆలస్యం చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇదే విషయాన్ని తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు స్పష్టం చేశారని పార్టీ సీనియర్ నాయకులు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొచ్చారు. మంత్రివర్గంలో చోటు కల్పించే విషయంలో గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని, కానీ ఇప్పటికి ఇప్పుడైతే మార్పులు ఉండే అవకాశం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత మాత్రమే మార్పు చేర్పులు దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని సదర నాయకులు పేర్కొన్నారు.
దీనిని బట్టి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న వారు మరింత ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఏడాది ఉగాది వరకు వారికి వెయిటింగ్ తప్పక పోవచ్చు అన్నది నాయకులు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పటికిప్పుడైతే మార్పు లేకపోవచ్చు అన్నది టిడిపి నేతల్లో స్పష్టంగా వినిపిస్తున్న మాట.
