లడ్డూ కల్తీ వ్యవహారం... సీఎం చంద్రబాబు నిప్పులు!
అవును... తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 5 Feb 2026 5:28 PM ISTఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మరికొంతమంది మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తప్పు చేసి, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తమపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అవును... తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తన నివాసంలో కీలక భేటీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... 2022లోనే నెయ్యి కల్తీపై నివేదిక వచ్చిందని.. అయితే దాన్ని అప్పటి పాలకులు తొక్కిపెట్టారని.. తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారని.. కల్తీ గురించి నివేదికలో స్పష్టంగా చెప్పినా దాన్ని తొక్కిపెట్టారని ఫైర్ అయ్యారు.
అయితే.. తాను ముఖ్యమంత్రి కాగానే ప్రక్షాళన మొదలుపెట్టానని.. శాంపిల్స్ ను పరీక్షలకు పంపించామని.. ఎన్.డీ.డీ.బీ నివేదికలోని అంశాన్నే తాను ప్రస్తావించానని చంద్రబాబు తెలిపారు. అసలు చరిత్రలో ఇంతవరకూ ఎవరూ వెంకన్నస్వామి జోలికి రాలేదని.. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేనితనమని అనుకోవాలా.. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది మీ లక్ష్యంగా అని ప్రశ్నిస్తూ.. దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమని చంద్రబాబు అన్నారు.
ఇదే సమయంలో... తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తమపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. దోషులను అన్ని విధాలా శిక్షిస్తామని.. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునే విషయంలో సీబీఐ తమకు ఓ నివేదిక పంపిందని.. ఈ సమయంలో ఏకసభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తామని.. ఇది పూర్తిగా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని.. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని తాను ఆనాడే చెప్పానని.. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అది పరాకాష్టకు చేరిందని తెలిపారు.
ఈ సందర్భంగా... నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని నివేదికలో ఎక్కడుంది? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఏమైనా కలకన్నారా? వాళ్లకు దేవుడు వచ్చి చెప్పారా? అంటూ సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని.. ఈ వ్యవహారాన్ని అంతా ఖండించాలని.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు సూచించారు.
'ప్రజలకు వాస్తవాలు తెలియాలి'!:
ఇదే విషయంపై స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్... గతంలో తిరుమల లడ్డూలో నాణ్యత లేదని ఫిర్యాదులు వచ్చాయని.. నెయ్యి నూనెలా జారిపోతుందని కార్మికులు చెబితే.. ఆర్గానిక్ నెయ్యి అంటూ వారికి అబద్ధాలు చెప్పారని.. ఈ సమయంలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్.డీ.డీ.బీ నివేదిక తేల్చిందని.. జంతుకొవ్వు కలిసినట్లు నివేదికలో తెలిపిందని.. ఈ వాస్తవాలు అన్నీ ప్రజలకు తెలియాలని అన్నారు. నెయ్యి కల్తీ అనేది ఆరోపణ కాదని.. అప్పటి పాలకులకు తెలిసే జరిగిమని స్పష్టం చేశారు!
