మహానాడుపై బాబు సంచలన నిర్ణయం
దేశమంతా ఇపుడు ఇబ్బందులో ఉంది. దాంతో ముందు ముందు ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కఠినమైన పొదుపు చర్యలను పాటించాలని పాలకులు ప్రజలకు పిలుపు ఇస్తున్నారు.
By: Satya P | 16 May 2026 12:20 AM ISTతెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఎంతటి సంబరమో అందరికీ తెలిసిందే. పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్న ఏకైక పార్టీగా టీడీపీ ఉంది. పార్టీ పండుగగా పసుపు వేడుకగా దానిని ఏపీ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు జరుపుకుంటారు. ఈసారి కూడా భారీ ఎత్తున మూడు రోజుల పాటు మహానాడుని నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని టీడీపీ నిర్వహించింది. అయితే ఇపుడు దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో టీడీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఆన్‌లైన్‌లోనే మహానాడు :
దేశమంతా ఇపుడు ఇబ్బందులో ఉంది. దాంతో ముందు ముందు ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కఠినమైన పొదుపు చర్యలను పాటించాలని పాలకులు ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ దీనిని పాటిస్తున్నారు. ముఖ్యమంత్రులు కూడా అనేక రాష్ట్రాలలో అనుసరిస్తున్నారు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు కూడా తన కాన్వాయ్ ని తగ్గించుకున్నారు. మంత్రులు కూడా పొదుపు చర్యలు పాటించాలని ఆయన కోరారు. దీంతో ఇపుడు పార్టీ పరంగా కూడా బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మహానాడుని మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించడమే కాదు ఆన్ లైన్ లో నిర్వహించాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈసారి మహానాడు ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు జరగనుంది
పార్టీ ఆఫీసులోనే :
ఇక ఆన్ లైన్ లో మహానాడుని ఎలా నిర్వహించాలన్న దాని మీద కూడా టీడీపీ వినూత్నమైన తీరుని అనుసరిస్తోంది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అతి పెద్ద స్టేజ్ ని ఏర్పాటు చేసి అక్కడ నుంచే ఆన్ లైన్ ద్వారా ఏపీలో మొత్తం టీడీపీ క్యాడర్ కి చేరేలా ఈ మహానాడు ఆన్ లైన్ లో సాగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేయి 845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహించనున్నారని చెబుతున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి జరిగే మహానాడులో పొలిట్ బ్యూరో మెంబర్స్ మాత్రమే పాల్గొంటారు. మిగిలిన నాయకులు మంత్రులు జిల్లా నేతలు అంతా కూడా ఎవరి జిల్లాలో ఎవరి నియోజకవర్గాలలో వారు క్లస్టర్ల వద్ద ఏర్పాటు చేసే స్క్రీన్ల నుంచి ఆన్ లైన్ ద్వారా మహానాడులో పాలు పంచుకుంటారు.
అభినందనీయం :
తెలుగుదేశం పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అని అంటున్నారు. ఎందుకంటే నెల్లూరులో మహానాడుకు ఏకంగా లక్షలాది మంది క్యాడర్ అలాగే వేల సంఖ్యలో లీడర్లు హాజరవుతారు. అంతమందికీ వాహనాల ద్వారా వచ్చేందుకు డీజిల్ పెట్రోల్ పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. మూడు రోజుల పాటు భారీ ఎత్తున జరిగే కార్యక్రమం పొదుపు చర్యలకు విరుద్ధంగా ఉంటుందని భావించే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పొదుపు అంటూ ఇచ్చిన పిలుపుని ఇప్పటికే టీడీపీ అందుకుంది. ప్రభుత్వ పరంగా చేయాల్సినది చేస్తోంది. ఇపుడు పార్టీ పరంగానూ టీడీపీ తన మార్క్ ని చాటుకుంది. ఇప్పటికే వైసీపీ లాంటి విపక్షాలు పొదుపు విషయంలో చేస్తున్న విమర్శలకు టీడీపీ తగిన జవాబు ఇచ్చింది అని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ నిర్ణయం భేష్ అని అంతా కొనియాడుతున్నారు.
