ప్రజల ముందుకు కూటమి ప్రొగ్రెస్ రిపోర్ట్...బాబు మార్క్ అంటే ఇదే !
ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం ప్లస్ వ్యూహం కలిగిన నేత. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో రాణించడానికి తనదైన రాజకీయ చతురత కారణం.
By: Satya P | 22 Jun 2026 12:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు అనుభవం ప్లస్ వ్యూహం కలిగిన నేత. ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో రాణించడానికి తనదైన రాజకీయ చతురత కారణం. ఎప్పటికపుడు కొత్తగా ఆలోచనలు చేయడం. ప్రజల నాడిని పట్టుకోవడానికి ఉత్సాహపడడం. ఈ విధంగా చేస్తూ బాబు అనేక సార్లు విజయం సాధించారు. కోట్లాది మంది ప్రజల మనసులలో ఏముందో తెలుసుకోవడం బహు కష్టం. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలోనూ ఎంతో ముందుంటారు. అందుకే ఆయన వ్యూహాలు ఎపుడూ తప్పు కావు ఒకటి రెండు సందర్భాల్లో తప్ప. అందుకే ఆయన సక్సెస్ రేటు కూడా ఎక్కువ అని చెబుతారు.
రెండేళ్ళ పాలన గురించి :
ఒక అయిదేళ్ల ప్రభుత్వానికి రెండేళ్ళ కాలం అంటే కీలకమైనది. ఈ ఏడాది తరువాతనే జనంలో ఒక ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. అది నెమ్మదిగా బలపడితే వ్యతిరేకత పెరిగితే ఇక ఎన్ని చేసినా చాలా కష్టం అవుతుంది. అందుకే కూటమి పాలన రెండేళ్ళు పూర్తి అయిన దాని మీద బాబు తిరుపతిలో విజయోత్సవ సభను నిర్వహించారు. అంతే కాదు ప్రతీ నియోజకవర్గంలో జిల్లా స్థాయిలోనూ విజయోత్సవ సభలను నిర్వహించేలా కూడా చర్యలు తీసుకున్నారు. ఇపుడు నేరుగా ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులను పంపిస్తున్నారు. అయితే వారితో పాటుగా ప్రోగ్రెస్ రిపోర్టులను కూడా వెంట తీసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పది అంశాలపై రిపోర్టులు :
ఏపీలో కూటమి పాలన మీద పది అంశాలకు సంబంధించి రిపోర్టులను తయారు చేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే సంబధింత శాఖలను ఆదేశించారు. 2024 కి ముందు అయిదేళ్ళ వైసీపీ పాలన ఎలా ఉంది. తమ ప్రభుత్వం వచ్చాక చేసింది ఏమిటి అన్న తేడాను స్పష్టంగా జనాలకు వివరించడానికే ఈ అంశాలను ఎంచుకున్నారని అంటున్నారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం అంశాలతో డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్టు ఉంటుంది. అదే విధంగా కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణలతో గుడ్ గవర్నెన్స్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉంటుంది. ఇక సంక్షేమం, పీ4 వంటి వాటితో వెల్ఫేర్ – ఎంపవర్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేస్తారు. వీటిని ప్రోగెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారులను ఆదేశించారు.
నాటి విద్వంశం మీద :
ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం 2024లో అధికారం చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన ఏడు శ్వేత పత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని బాబు సూచించారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి శ్వేత పత్రాలని అప్పట్లో విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలో వికాసం వైపు ఎలా తీసుకెళ్లింది అన్నదే ఇపుడు ప్రొగ్రెస్ రిపోర్టులో ఉండబోతోంది. రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించింది వంటి అంశాలను తాజా ప్రోగ్రెస్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు.
గాడిన పడిన పాలన :
వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన సర్కార్ బండిన గాడిన పెట్టి పాలనను సజావుగా జరిగేలా చూశామని ప్రొగ్రెస్ రిపోర్టుల ద్వారా చంద్రబాబు చెప్పనున్నారు. అంతే కాదు రెండేళ్లలో చాలా శాఖల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని గుర్తు చేయనున్నారు. జూలై 18వ తేదీనాటికల్లా మొత్తం అన్ని రిపోర్టులు విడుదల చేసేలా ప్రణాళికను సిద్దం చేయాలని బాబు అధికారులకు సూచించారు. ఇవన్నీ విడుదల చేసిన తర్వాత అన్నీ కలిపి పుస్తక రూపంలో తీసుకురావాలని కూడా ఆయన ఆదేశించారు. కేవలం ఈ ఏడాది మాత్రమే కాదని ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
