Begin typing your search above and press return to search.

తెలంగాణతో నీళ్ల పంచాయితీ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతోపాటు అంతకు ముందు తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

By:  Tupaki Political Desk   |   5 Jan 2026 4:38 PM IST
తెలంగాణతో నీళ్ల పంచాయితీ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతోపాటు అంతకు ముందు తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభ వేదికపై నుంచి తాను కొన్ని విషయాలను చెప్పడం లేదని, కానీ తెలుగువారు ఎప్పటికీ కలిసి ఉండాలనే ఆశయంతో పనిచేస్తున్నందున కొంత వరకు మాట్లాడతానంటూ తెలంగాణలో జరుగుతున్న నీళ్ల లొల్లిపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ది కోసం తన పార్టీ చేసిన కృషిని ప్రస్తావించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని, ఇరు రాష్ట్రాల మధ్య సమైక్యత అవసరమని అభిప్రాయపడ్డారు. ఒకిరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గోదావరిలో నీటిని తెలంగాణ భేషరతుగా వాడుకోవచ్చని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి ఏటా గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీరు వృథాగా కలుస్తుందని, ఆ నీటిని చూస్తే తనకు బాధ కలుగుతోందని అన్నారు. నీటి విషయంలో తెలంగాణకు తాను సహకరిస్తానని విస్పష్టంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు తెలుగు వారు అంతా కలిసి ఉండాలనేది తన జీవితాశయం అంటూ వెల్లడించారు. రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నుంచి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు తెలుగునాట తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ప్రధానంగా తన స్వరాష్ట్రంలో విపక్షంపై పైచేయి సాధించేందుకు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబును ఇరుకన పడేశారని రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు వారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలని కోరుకుంటున్న తాను తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రస్తావించిన రాయలసీమ లిఫ్ట్ పై తన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన చేయని, చంద్రబాబు గడిచిన 30 ఏళ్లుగా టీడీపీ సారథ్యంలో కృష్ణా, గోదావరి నదుల నీటిని ఏ విధంగా వాడుకున్నది, తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు ఎలాంటి మేలు జరిగిందన్న విషయాలపై సవివరమైన వివరణ ఇచ్చారు.

30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జున సాగర్ నీటిని ఏపీకి ఉపయోగించుకోవాలని భావించామని, అదే సమయంలో ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ తీసుకువచ్చి రెండు ప్రాంతాల ప్రజలకు తాగునీటి సరఫరా చేశామని గుర్తుచేశారు. అదేవిధంగా తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణాపై కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఏఎంఆర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ‘‘రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో అమరావతి, పోలవరంపై ప్రత్యేక హామీ పొంది అభివృద్ధి చేసుకుంటున్నాం’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఏటా 6280 టీఎంసీలు నీళ్లు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, ఈ నీళ్లన్నీ గోదావరి, కృష్ణా బేసిన్ వంటూ చంద్రబాబు ఎత్తిచూపారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చని భావించానని స్పష్టం చేశారు. ఆ ఆలోచనతోనే కాళేశ్వరం కట్టినప్పుడు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. గోదావరిలో ఎన్ని నీళ్లైనా వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో దేశంలో నదుల అనుసంధానం జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘గంగా-కావేరి కలపాలి. దేశవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించాలి’ ఇదే నా జీవితాశయం అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు.