Begin typing your search above and press return to search.

పార్టీని శాశ్వతంగా పవర్ లోకి.. దీన్ని అత్యాశ అంటారు చంద్రబాబు

ఎంత అద్భుతమైన వస్తువుకు.. ఎంతటి రుచికరమైన పదార్థానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.

By:  Garuda Media   |   13 Nov 2025 9:26 AM IST
పార్టీని శాశ్వతంగా పవర్ లోకి.. దీన్ని అత్యాశ అంటారు చంద్రబాబు
X

ఎంత అద్భుతమైన వస్తువుకు.. ఎంతటి రుచికరమైన పదార్థానికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. అంతదాకా ఎందుకు ఈ సృష్టిలో అత్యంత మేధోసంపన్నమైన జీవిగా పేర్కొనే మనిషికి సైతం ఎక్స్ పైరీ డేట్ (మరణం) ఉంటుందన్నది తెలిసిందే. దీనికి విరుద్ధంగా శాశ్వతంగా కొన్ని అంశాల్ని ఉంచాలనుకోవటం అత్యాశే అవుతుంది. మరింత కఠినమైన పదంలో చెప్పాలంటే సృష్టి ధర్మానికి విరుద్ధమని చెప్పక తప్పదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి ఇదే తరహాలో వచ్చిన వ్యాఖ్యను విన్నోళ్లకే కాదు.. ఆయన మాటలు విన్నోళ్లంతా ఒక్కసారిగా నవ్వేసే పరిస్థితి. ఇంతకూ చంద్రబాబు ఏమన్నారు? అన్న విషయంలోకి వెళితే..

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిధిలో టీడీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందుకు దేవగుడిపల్లి అనే చిన్న గ్రామం వేదికైంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ‘పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. అందులో భాగంగా నెలవారీగా నియోజకవర్గాలపై అభిప్రాయ సేకరణ చేపడతాం. అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం’ అంటూ చెప్పిన మాటలు.. వినేందుకు బాగానే ఉన్నా.. ఇంత పనిని చేసే వారెవరు? ఎవరికి బాధ్యత అప్పచెబుతారు. అన్నది పెద్ద ప్రశ్న.

అధికారంలో ఉన్న రోజుల్లో అంతకు ముందు జరిగిన పనులు.. ఎదురైన చేదు అనుభవాల్ని చంద్రబాబు తేలిగ్గా మరచిపోతారని.. చర్యల విషయంలో ఆయన ఎప్పుడూ కఠినంగా వ్యవహరించరన్న పేరుంది. ఇలాంటి తీరుకు భిన్నంగా పార్టీని శాశ్వతంగా అధికారంలోకి నిలిపే ప్రణాళికను సిద్ధం చేశామన్న మాట బాగానే ఉన్నా.. ఆచరణలో అదే మాత్రం సాధ్యం కాని అంశంగా చెప్పాలి. అయితే.. ఈ తరహా వాదనను కొట్టిపారేసేలా చంద్రబాబు కొన్నివ్యాఖ్యలు చేస్తున్నారు.

అందులో ముఖ్యమైనది.. గుజరాత్ లో పాతికేళ్ల నుంచి ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో అక్కడ డెవలప్ మెంట్ శరవేగంగా సాగుతోందని.. అదే తరహా ఏపీలో జరగాల్సిన అవసరం ఉంది. పార్టీ ఇకపై ఓడిపోవటం అన్నది ఉండదని చెబుతున్న చంద్రబాబు.. ‘‘మన విజయానికి ఎన్నో వ్యూహాలు ఉన్నాయి. కార్యకర్తలు సంత్రప్తికరంగా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపట్టాం. జెండా మోసిన వారి త్యాగాలు గుర్తుకొస్తున్నాయి. ఎవరినీ విస్మరించటం లేదు. వారి అభిప్రాయానికే విలువను ఇచ్చి పదవులు ఇచ్చాం. చాలాచోట్ల పార్టీ శ్రేణులు తిరస్కరించటంతో పలువురిని పదవుల నుంచి పక్కన పెట్టాం’’ అంటూ తనదైన మాటల్ని చెప్పుకొచ్చారు.

కార్యకర్తల అభిప్రాయాలకు విలువనిచ్చి కొందరికి పదవుల్ని పక్కన పెట్టినట్లు చంద్రబాబు.. మరి వాటిని ఎవరికి కేటాయించారు? అన్నది కూడా ప్రశ్న. కార్యకర్తలకు పదవులు ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో అలాంటి పరిస్థితి లేదన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉండటం లేదన్న మాట తెలుగు తమ్ముళ్ల నోటి నుంచి వినిపిస్తోంది.

తాను చెప్పే కొన్ని అంశాలు వాస్తవరూపంలో జరుగుతున్నట్లుగా చెప్పే మాటలే.. సీఎంచంద్రబాబు మీద లేని కోపాన్ని వచ్చేలా చేస్తాయని చెప్పాలి. ఈ తరహా ప్లానింగ్ కు బదులుగా.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మీద పెట్టొచ్చు కదా? అన్నది ప్రశ్న. ప్రభుత్వానికి ఏదైతే మైలేజీ తెచ్చి పెడుతుందో.. ఆయా అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం.. అలాంటి కార్యక్రమాలు శాశ్వతంగా వ్యవహరించేలా వాటిని నిర్వర్తించటం చాలా అవసరం.

ఇవన్నీ వదిలేసి.. పార్టీని పర్మినెంట్ గా పవర్ లో ఉండేలా ప్లానింగ్ చేస్తామన్న మాట.. అత్యాశ ధ్వనించేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. పదవులు.. పవర్ అన్నది ఏ రాజకీయ నాయకుడు.. అధినేత చేతల్లో ఉండదు. సాదాసీదా నుంచి సెలబ్రిటీ వరకు ఉండే ఓటర్లు డిసైడ్ చేస్తారు. అందుకే ఈ తరమా అంశాలపై మాట్లాడే వేళలో.. నోటి నుంచి వచ్చే మాటల విషయంలో కాస్తంత పొదుపును ప్రదర్శిస్తే బాగుంటుంది చంద్రబాబు.