ఎవరా ఎమ్మెల్యేలు.. బాబు సీరియస్.. రీజనిదే ..!
``ఎవరా ఎమ్మెల్యేలు.. నాకు వారి వివరాలు ఇవ్వాల్సిందే`` అని సీఎం చంద్రబాబు.. పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు.
By: Garuda Media | 15 Aug 2025 8:00 PM IST"ఎవరా ఎమ్మెల్యేలు.. నాకు వారి వివరాలు ఇవ్వాల్సిందే" అని సీఎం చంద్రబాబు.. పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆయన అదేప నిలో ఉన్నారు. సుమారు 70 మంది ఎమ్మెల్యేలు.. చంద్రబాబు చెప్పిన మేరకు.. నడుచుకోలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వీరపై చర్యలు తీసుకునేందుకు సీఎం చంద్రబాబు పార్టీ అధినేతగా ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి చర్యలే కాదు.. అసలు ఎందుకు ఇలా చేశారంటూ.. వారి నుంచి వివరణ కూడా తీసుకోనున్నారు.
విషయం ఏంటి ..!
తాజాగా 31 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వీటిలో మూడు జనసేనకు ఇవ్వగా.. రెండు బీజేపీకి అప్పగించారు. మిగిలిన వాటిని టీడీపీ నేతలకు అప్పగించారు. అయితే.. వీరిలోనూ.. ఒకటి బహుజన జేఏసీ నేత... బాలకోటయ్యకు ఇచ్చారు. మిగిలిన వారిలో సగం మందిని స్వయంగా సీఎం చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. అయితే.. వాస్తవానికి.. ముందుగానే అంటే.. రెండు మాసాల కిందటే నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు.. ఎంపీలకు కూడా చెప్పారు.
పార్టీపరంగా గత ఎన్నికల్లో మనకు ఉపయోగపడిన వారి పేర్లను తనకు ఇవ్వాలని.. నామినేటెడ్ పదవుల వ్యవహారం తేలుస్తానని చెప్పారు. దీనికి ఎమ్మెల్యేలు ఓకే అన్నారు. దీంతో తాజాగా ఇచ్చిన 31 పదవుల్లో ఏకంగా.. 200 వరకు ఇవ్వాలని అనుకున్నారు. కానీ, ఎమ్మెల్యేల నుంచి సరైన స్పందన రాలేదు. ఫలితం గా తానే రంగంలోకి దిగి సగం మందిని ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వారిని మాత్రం 12 మంది ఎమ్మెల్యే లు సిఫారసు చేసిన వారికి ఇచ్చారు. మరి మిగిలిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి? అనేది చంద్రబాబు ప్రశ్న.
నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేశారు? ఎంత మంది పార్టీ కోసం కష్టపడ్డారు? అనే విషయాలను ఎమ్మెల్యేలు ఒడబోసి సిఫార్సు చేయాలి. తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉంది. అయితే.. నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు.. కొందరు నాయకులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. నియోజకవర్గంలో అధికార కేంద్రాలను పెంచుకోవడం ఇష్టం లేనివారు.. అసలు ఈ విషయాన్ని పక్కన పెట్టారు.
మరికొందరు `తమ వారు` అయితేనే.. సిఫార్సు చేస్తామని మొండిగా వ్యవహరించారు. దీంతో 200 పదవు లు కాస్తా.. 31కి తగ్గిపోయాయి. వీటిలోనూ.. కేవలం 25 మాత్రమే టీడీపీ భర్తీ చేసింది. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
