తటస్థులకు టీడీపీ టికెట్లు ?
తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చేసినన్ని ప్రయోగాలు మరే పార్టీ చేయలేదు. టీడీపీ పుణ్యమాని ఎంతో మంది రాజకీయంగా అందలాలు అందుకున్నారు.
By: Satya P | 9 Oct 2026 9:13 AM ISTతెలుగుదేశం పార్టీ రాజకీయంగా చేసినన్ని ప్రయోగాలు మరే పార్టీ చేయలేదు. టీడీపీ పుణ్యమాని ఎంతో మంది రాజకీయంగా అందలాలు అందుకున్నారు. మంచి భవిష్యత్తుని చూశారు. అనూహ్యంగా ఉన్నత స్థానాలకు ఎగబాకారు. రాజకీయంగా అవకాశాలు రావడం కష్టం అనుకుంటున్న వారికి టీడీపీ పిలిచి టికెట్లు ఇచ్చి కీలక పదవులు కట్టబెట్టింది. అలా టీడీపీ స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ ఎంతో మందికి చాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ముంగింట్లో ఉన్న వేళ టీడీపీ అభ్యర్ధుల ఎంపికలో ఏ విధానం అవలంభిస్తుంది అన్నది చర్చగా ఉంది. టీడీపీ అయితే విజయావకాశాలనే ప్రమాణంగా తీసుకుని ఏ ప్రయోగం అయినా చేస్తుంది. అందుకే మరోసారి తటస్థులకు టికెట్లు ఇచ్చేందుకు చూస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
మంత్రుల నుంచేనట :
ఇక లేటెస్ట్ గా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తరువాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నపుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ వచ్చింది అని అంటున్నారు. దాంతో కొందరు మంత్రులు ఈసారి ఎన్నికల్లో తటస్థులకు టికెట్లు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచించినట్లుగా చెబుతున్నారు. మరి కొందరు అయితే పార్టీలో సీనియర్ నేతలకు అవకాశాలు దక్కని వారికి ఒక చాన్స్ ఇవ్వాలని కూడా కోరారని అంటున్నారు. అయితే వీటి మీద అధినేత చంద్రబాబు ఏమి ఆలోచిస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అయితే చర్చగా ఉంది.
హిట్ ఫార్ములాగానే :
టీడీపీ తటస్థులకు టికెట్లు పెద్ద ఎత్తున 1999లో ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇచ్చింది. దాంతో ఎంతో మంది విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, అలాగే సామాజిక సేవలో ఉన్న వారు కీలక పదవులు అందుకున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ అయితే ఇలాంటి ప్రయోగాలు అనేక సార్లు చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ఎపుడూ టాలెంట్ ని చూసి చాన్స్ ఇచ్చేవారు. అలా రాజకీయాలకు దూరంగా ఉండే డీవీ సుబ్బారావు అనే ప్రముఖ న్యాయవాదికి అప్పట్లో టికెట్ ఇచ్చి విశాఖ మేయర్ ని చేసిన ఘనత ఎన్టీఆర్ దే అని చెప్పుకుంటారు. ఇపుడు కూడా విశాఖ మేయర్ లాంటి పదవులకు రాజకీయ నీడ కంటే కూడా ప్రజలలో మంచి పేరున్న వారిని తెచ్చి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది అయితే డిస్కషన్ పాయింట్ గా ఉంది. కేవలం విశాఖ మాత్రమే కాదు అనేక ఇతర నగరాలలో ముఖ్యంగా మేయర్లు, జిల్లా పరిషత్తు చైర్మన్లు వంటి పదవులలో కొన్ని తటస్థులకు ఇస్తే కనుక ఫ్రెష్ లుక్ తో పాటు మంచి రిజల్ట్ వస్తుందని పార్టీలో చర్చిస్తున్నారు.
అందరి పార్టీగా :
టీడీపీకి విద్యావంతులు తటస్థ ఓటర్లలో మంచి పేరు ఉంది. గ్రాఫ్ కూడా అక్కడ బాగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరింతగా ఆ పాపులారిటీని పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. దాంతో తటస్థులకు పార్టీ టికెట్ ఇవ్వవచ్చు అన్నది అయితే ప్రచారంలో ఉంది. దాంతో చాలా చోట్ల విద్యా వంతులు ప్రముఖులు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారు టీడీపీని ఆశ్రయిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి టీడీపీ నుంచి ఎవరికి ఈ లక్కీ చాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.
