Begin typing your search above and press return to search.

మోదీ జపంలో చంద్రబాబు.. మరీ అంత అవసరమంటారా?

By:  Tupaki Political Desk   |   1 Oct 2025 6:00 PM IST
మోదీ జపంలో చంద్రబాబు.. మరీ అంత అవసరమంటారా?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ చరిత్ర. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తన పార్టీ సాధించిన సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. సాధారణంగా ఇలా రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా తన మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. రాజకీయంగా పైచేయి సాధించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీకి ఎంతో గౌరవం ఇస్తూ విలక్షణత చాటుకుంటున్నారు. దీంతో చంద్రబాబు తాజా రాజకీయ వ్యూహం ఎవరికీ అంతుచిక్కడం లేదు.

16 మంది ఎంపీల బలంతో కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త తగ్గినట్లే రాజకీయం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీని ఆకాశానికెత్తుతూ ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రం ఏ పథకం ప్రవేశపెట్టినా ముందుగా మద్దతుగా ప్రకటిస్తూ ఆ పథకానికి విస్త్రుత ప్రచారం కల్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ నేతలు కన్నా ప్రధాని మోదీని పొగడటంలో చంద్రబాబు ముందుంటున్నారని అంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలలో చంద్రబాబు స్పందించిన తీరును పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ సంస్కరణలు ప్రకటించిన వెంటనే మొదట స్పందించారు చంద్రబాబు. అంతేకాకుండా జీఎస్టీ సంస్కరణలకు మద్దతు ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అక్కడితో ఆగకుండా జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలు ఎంత మేర ప్రయోజనం పొందనున్నారో వివరిస్తూ ఈ నెల 15 నుంచి ఇంటింటా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం కూడా చేశారు. దేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అవేవీ చేయని విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు చంద్రబాబు.

ఇక చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రధాని మోదీని గ్రేట్ లీడర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రధాన కార్యక్రమాలకు ప్రధాని మోదీని గెస్ట్ గా ఆహ్వానిస్తూ అగ్ర తాంబూళం ఇస్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా సీఎం చంద్రబాబు ఇలా ప్రధాని మోదీ జపం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్గా మారింది. సహజంగా చంద్రబాబు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పట్లో ప్రధాని మోదీగా ఉన్నా ఇంత ఏకపక్షంగా వ్యవహరించలేదని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మోదీ విధానాలలో లోటుపాట్లను చంద్రబాబు ప్రస్తావించారని అంటున్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుకు అవసరం లేకపోయినా సరే మోదీ జపం చేయడమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.