చంద్రబాబుపై రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు.. సుభాష్ చంద్ర గార్గ్ ఆత్మకథలో ఏముందంటే?
ఈ సందర్భంగానే చంద్రబాబు తాను అనుకున్నది సాధించుకునేందుకు ‘తన రక్తం కళ్ల చూసేలా వెంటపడేవారని’ వ్యాఖ్యానించారు.
By: Tupaki Political Desk | 25 Oct 2025 6:12 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై రిటైర్డ్ ఐఏఎస్, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ డైరెక్టరుగా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ సంచలన విషయాలను వెల్లడించారు. 1999-2004 మధ్య కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ ఆ తర్వాత రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన ‘నో మినిస్టర్’ అనే పేరుతో తన ఆత్మకథను రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ చాప్టర్ రాశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో విపరీతమైన పలుకుబడి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన కింగ్ మేకర్ గా చంద్రబాబు తన రాష్ట్రం ప్రయోజనాల కోసం ఎంతలా పనిచేసేవారో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన ఆత్మకథలో ఇతర రాష్ట్రాల దృక్కోణంలో చంద్రబాబుపై విమర్శలు చేసినా ఉమ్మడి రాష్ట్రం, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతలా పరితపించిపోయేవారనేది ఆ చాప్టర్ లో స్పష్టంగా తెలియజేశారు.
సుభాష్ చంద్ర గార్గ్ ఆర్థిక శాఖలోని ఎకనామిక్ అఫైర్స్ చూసేవారు. అప్పట్లో ప్రధానిగా వాజపేయి ఉండగా, చంద్రబాబు మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగేది. అయితే చంద్రబాబు దేశంలో మిగతా రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోకుండా, కేవలం తన రాష్ట్రం కోసమే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గరిష్ట ప్రయోజనం పొందేవారని సుభాష్ చంద్రగార్గ్ తన ఆత్మకథలో వివరించారు. పలు ఉదాహరణలతో చంద్రబాబు పనితీరును వర్ణించిన ఆయన తాను డైరెక్టరుగా పనిచేయగా, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అడ్డు చెప్పేవాడనని, కానీ, చంద్రబాబు అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకువచ్చి తాను అనుకున్న పని చేయించుకునేవారని ఆయన వివరించారు.
ఈ సందర్భంగానే చంద్రబాబు తాను అనుకున్నది సాధించుకునేందుకు ‘తన రక్తం కళ్ల చూసేలా వెంటపడేవారని’ వ్యాఖ్యానించారు. ఒక సమయంలో చంద్రబాబు ప్రమేయంతో ప్రపంచ బ్యాంకు నుంచి వంద శాతం రుణం తీసుకుని గ్రాంటుగా మార్చుకున్నారని ఉదాహరణలతో సహా వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే తొలిసారిగా ప్రపంచ బ్యాంకు రాష్ట్రాలకు అప్పులిచ్చే విధానం మొదలైందని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి మొత్తం రుణం గ్రాంటుగా తీసుకుంటే దేశంలో మిగతా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తాను అడ్డు పడితే, అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ వద్దకు ఫైల్ తెప్పించుకుని, ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ ద్వారా ఆ ఫైల్ ను ఆమోదించుకున్నారని సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుభాష్ చంద్ర గార్గ్. ‘చంద్రబాబు తన రాష్ట్రం కోసం ఏమైనా చేస్తారని.. 1999-2004 మధ్య దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకే ఎక్కువ మేలు జరిగిందని ఆయన వివరించారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రవర్తనను ‘ఉన్మాదంతో కూడిన ఉత్సాహం’గా ఆయన ప్రస్తావించడం విశేషంగా చెబుతున్నారు. సుభాష్ చంద్ర మాటల్లో చంద్రబాబు పూర్తిగా తన రాష్ట్ర ప్రయోజనం కోసమే పనిచేస్తారని, మిగతా రాష్ట్రాలను ఆయన ఏ మాత్రం పట్టించుకోరని నిష్టూరమాడారు. ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తన అనుభవాలతో రాసిన ఆత్మకథలో చంద్రబాబు కోసమే ప్రత్యేకంగా ఓ చాప్టర్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు ఏ స్థాయిలో పనిచేసేవారో సుభాష్ చంద్ర గార్గ్ ఆత్మకథ చెబుతోందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
