చంద్రబాబు సెకండ్ షేడ్ ఇదేనా ..!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తరచుగా తనలో సెకండ్ షేడ్ చూస్తారని.. 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారుతానని చెబుతున్నారు.
By: Garuda Media | 11 Aug 2025 8:00 AM ISTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తరచుగా తనలో సెకండ్ షేడ్ చూస్తారని.. 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారుతానని చెబుతున్నారు. అయితే.. పార్టీ నాయకులు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. తమ దారిలో తాము నడుస్తున్నారు. కొందరు పార్టీ అధినేత చెప్పిన మాటకు వాల్యూ ఇస్తుండగా.. మరికొందరు మాత్రం తమ ఇష్టానుసారంగానే కార్యక్రమాలుచేస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయన్నది వాస్తవం. అందుకే చంద్రబాబు పదే పదే తమ్ముళ్లను హెచ్చరిస్తున్నారు.
అయినా.. వారిలో మార్పు రాకపోయే సరికి.. తన సెకండ్ షేడ్ చూపించాలని అనుకున్నారో.. ఏమో.. ఆయ న అనుకున్నంత పనినీ ప్రారంభించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరును నిన్న మొన్నటి వరకు.. సమీక్షించి, అంచనాకు వచ్చిన చంద్రబాబు.. వారిని పలు దఫాలుగా హెచ్చరించారు. అయితే.. ఇప్పుడు నియోజకవర్గం నిధుల విషయంలో వారికి చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యారు. ఇటీవల 16 మంది ఎమ్మెల్యేలు.. అనుకుని వచ్చారో.. అనుకోకుండా వచ్చారో.. సీఎంవోకు వచ్చి.. తమ తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని కోరారు.
దీనికి సంబంధించి వారు ఒక్కొక్కరూ.. 50 పేజీలకు పైగా నివేదికలను చంద్రబాబుకు అందించారు. తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని.. వాటికి నిధులు ఇవ్వాలని వారు కోరారు. అయితే.. చంద్రబాబు వీరి విషయంలో సానుకూలంగానే ఉన్నా.. అసలు ఇప్పటి వరకు పనులు చేయాలని కోరుతూ.. సీఎంవో ను సంప్రదించని వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. దీనిని బట్టి.. వారి విషయాన్ని ప్రశ్నించా లన్నది ఆయన ఉద్దేశం. పనులు చేయాలని కోరడం తప్పుకాదు. అసలు పట్టించుకోకుండా.. మౌనంగా ఉన్నవారి విషయంలోనే చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు.
దీంతో ఇప్పుడు ఏయే నియోజకవర్గాల్లో ఎన్నెన్ని పనులు చేపట్టారు? ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన సొమ్ము ఎంత? ఆ నిధులను జాగ్రత్తగానే ఖర్చు చేశారా? అనేది.. అధికారుల నుంచే నివేదిక తెప్పించు కునేందుకు రెడీ అయ్యారు. ఇది 1995-2004 మధ్య జరిగిన కార్యక్రమం. అప్పట్లోనూ ఎమ్మెల్యేల పనితీరుపైనా, నిధుల వినియోగంపైనా.. నేరుగా అధికారుల నుంచే నివేదికలు తెప్పించుకున్నారు. దీనికి కలెక్టర్లను వాడుకున్నారు. ఇప్పుడు కలెక్టర్లతోపాటు.. శాఖాధిపతులను కూడా వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. దీనిని బట్టి.. ఎమ్మెల్యేలను అంచనా వేయనున్నారు. సో.. మొత్తానికి చంద్రబాబులో సెకండ్ షేడ్ బయట పడినట్టేనని తెలుస్తోంది.
