జాతీయ రాజకీయాల్లోకి బాబు... ఇంట్రెస్ట్ ఉందా లేదా ?
ఏపీ సీఎం గా నాలుగు సార్లు గా పనిచేస్తున్న వారు చంద్రబాబు. ఆయనకు ఉన్న ఈ రికార్డు సమీప భవిష్యత్తులో ఎవరూ కొట్టలేరు.
By: Satya P | 9 Feb 2026 9:26 AM ISTఏపీ సీఎం గా నాలుగు సార్లు గా పనిచేస్తున్న వారు చంద్రబాబు. ఆయనకు ఉన్న ఈ రికార్డు సమీప భవిష్యత్తులో ఎవరూ కొట్టలేరు. పైగా ఆయనది అర్ధ శతాబ్దం పైబడిన రాజకీయం. ఆయన 1995లో తొలిసారి సీఎం అయ్యారు. ఈ మూడు దశాబ్దాల కాలంలో సగానికి పైగా కాలం బాబు సీఎం గానే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన బాబు విభజన ఏపీలో ఏడేళ్ళుగా అదే పదవిలో పనిచేస్తున్నారు. నిజానికి 23 ఉమ్మడి జిలాలతో దక్షిణ భారత దేశంలో అతి పెద్ద స్టేట్ గా ఉన్న ఉమ్మడి ఏపీలో సీఎంగా బాబు తొమ్మిదేళ్ళ పాటు చేశారు. ఆ రికార్డు అలాగే ఉంది. అలా పెద్ద స్టేట్ కి చేసిన వారు కేవలం 13 ఉమ్మడి జిల్లాలకు పరిమితం అయిన ఏపీకి చేయడం అంటే బాబు దానికి సైతం సరే అంటూ బాధ్యతలు స్వీకరించారు. ఒక సవాల్ గా తీసుకుని పనిచేస్తున్నారు.
జాతీయ రాజకీయాలంటే :
అదేంటో బాబుకు మొదటి నుంచి జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదనే చెప్పాలి. ఆయన 1995లో సీఎం కాగానే ఏడాది వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 28 దాకా ఎంపీ సీట్లు దక్కాలి. అలా బాబుకు చిన్న వయసులోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి బాబు 1997లో దేవేగౌడను ప్రధానిగా చేశారు. ఆనాడే బాబుకు ప్రధానిగా చాన్స్ వచ్చింది. ఇక దేవేగౌడ తరువాత కూడా బాబునే ఆ పదవి చేపట్టమన్నారు. కానీ ఆయన నో చెప్పి గుజ్రాల్ కి చాన్స్ ఇచ్చారు. అయితే అప్పటికి బాబు ఏజ్ తక్కువ కాబట్టి ఏపీ మీద ఫోకస్ పెట్టారు అనుకున్నా బాబు ఏ దశలోనూ జాతీయ రాజకీయాల గురించి అయితే ఆలోచించలేదనే చెప్పాలి.
ఏడున్నర పదుల వయసులో :
బాబు మొత్తం రాజకీయ జీవితంలో పది సార్లు పోటీ చేస్తే ఒక్కసారి తప్ప తొమ్మిది సార్లు గెలిచారు. ఇక ఆయన 1985లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గెలుపు కోసం పనిచేశారు. పార్టీ పటిష్టతకు ఆ అయిదేళ్ళూ ఆయన సమయం వెచ్చించారు. మరో వైపు చూస్తే ఎన్టీఆర్ కి జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. కానీ బాబు మాత్రం జాతీయ స్థాయిలో తన పాత్రను పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరిపి ఏపీకి సాయం ఎక్కువగా తీసుకుని రావాలనే ఆలోచిస్తూ వచ్చారు.
లోకేష్ ఎదిగిన నేపథ్యం :
ఇపుడు బాబు నాలుగు సార్లు సీఎం అయ్యారు. 2029 ఎన్నికల దాకా ఆయనే సీఎం ఆ తరువాత టీడీపీ కూటమి మరోసారి గెలిస్తే కచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు అని బాబు కేంద్ర రాజకీయాలకు వెళ్తారని ప్రచారం చాలా కాలంగా వస్తోంది. అయితే అవన్నీ ఒట్టి ఊహాగానాలే తప్పించి వాటి మీద ఎలాంటి స్పష్టత అయితే లేదు. మరో వైపు బాబు కూడా అదే విషయం స్పష్టం చేశారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన జాతీయ రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తనకు అసలు ఆసక్తి లేదని అన్నారు.
సంతృప్తి చాలు అంటూ :
తనకు ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ళు సీఎం గా పనిచేసే చాన్స్ వచ్చిందని హైదరాబాద్ ని ఐటీ క్యాపిటల్ గా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. అలాగే ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. ఇపుడు దేశంలో తలసరి ఆదాయంలో హైదరాబాద్ నంబర్ వన్ గా దేశంలో ఉందని బాబు చెప్పారు. ఒక మోడల్ ని తాను క్రియెట్ చేసి సక్సెస్ అయ్యానని అది ఇపుడు అమలు అవుతోంది అన్నారు. విభజన ఏపీలో కూడా తాను అదే విధంగా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను అని అన్నారు. తాను పాలించిన ప్రాంతం చిన్నదా పెద్దగా అన్న ఆలోచన లేదని తాను ఎంత మేరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాను అని ఆలోచిస్తాను అని బాబు చెప్పారు. జాతీయ స్థాయిలో కూడా తాను టెలికం రంగంలో సంస్కరణలకు అలాగే జాతీయ స్థాయిలో రోడ్ల అభివృద్ధికి, స్వచ్చ భారత్ వంటి వాటి విషయంలో సలహాలు ఇచ్చి జాతీయ స్థాయిలో తన పాత్రను కొనసాగిస్తున్నాను అని చెప్పారు.
ఎంపీగా చేయని వైనం :
సమకాలిన రాజకీయాలలో చూస్తే బాబులా స్టేట్ కి కట్టుబడి ఉండే రాజకీయ నేతలు కనిపించరు. బాబు మాత్రం ఓడినా గెలిచినా రాష్ట్రమే అంటారు. ఆయన మొత్తం పొలిటికల్ కెరీర్ లో ఎంపీగా ఇప్పటిదాకా పోటీ చేయలేదు, అలా జాతీయ స్థాయి ఆసక్తి తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరి ఒకవేళ అంతా ప్రచారం సాగుతున్నట్లుగా లోకేష్ కనుక సీఎం అయితే బాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక పార్టీలో కీలకంగా ఉంటారా అన్నది అయితే ఇప్పటికి తెలియదు. ముందు ముందు చూడాల్సి ఉంది.
