ఆయిల్ కంపెనీలకు బాబు సీరియస్ వార్నింగ్
ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అని కొద్ది రోజులుగా జనాలు అంటున్నారు ఎక్కడకు వెళ్ళినా క్యూ లైన్లు ఉంటున్నాయి.
By: Satya P | 27 April 2026 9:16 AM ISTఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అని కొద్ది రోజులుగా జనాలు అంటున్నారు ఎక్కడకు వెళ్ళినా క్యూ లైన్లు ఉంటున్నాయి. ఇంధనం దొరకడం లేదు. దాంతో జనం బాధ చెప్పనలవి కాకుండా ఉంది. దీని మీద కూటమి ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. బాబు అయితే వెరీ సీరియస్ గా రంగంలోకి దిగారు. ఆయన సమీక్షా సమావేశం పెట్టి మరీ మొత్తం ఏపీలో పెట్రోల్ డీజిల్ సరఫరా మీద స్వయంగా ఆరా తీశారు. ఒక్క రోజులోనే డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలని ముఖ్యమంత్రి హోదాలో బాబు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఏకంగా ఉగ్ర రూపమే చూపించారు.
పరిస్థితి మారాల్సిందే :
ఏపీలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని బాబు అధికారులను ఆదేశించారు. ఇరవై నాలుగు గంటలలోగా రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులను సైతం ఆదేశించారు. అసలు ఎందువల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది అన్న దాని మీద పూర్తి వివరాలను బాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రిటైల్ ఔట్ లెట్ల దగ్గర వాణిజ్య వినియోగదారులు కొనుగోళ్లు జరపడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వివరించారు.
ఒక్కసారిగా పెరిగింది :
రాష్ట్రంలో మామూలుగా పెట్రోల్ రోజుకు 6,330 కేఎల్ అమ్మకాలు జరుగుతాయి, ఒక్కసారిగా 34 శాతం డిమాండ్ పెరిగి 8,489 కేఎల్‌కు అమ్మకాలు చేరాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు డీజిల్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. డీజిల్ కూడా అనూహ్యంగా డిమాండ్ గా మారిందని చెప్పుకొచ్చారు. దీనికి తోడు నయారా, రిలయన్స్, జియో వంటి ప్రైవేట్ ఆపరేటర్లు కూడా తమ కంపెనీ బంకులకు సప్లై నిలిపివేయడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేశాయని జిల్లా కలెక్టర్లు వివరించారు.
సీసీ కెమేరాల ద్వారా పర్యవేక్షణ:
ఇదిలా ఉంటే ఆయిల్ కంపెనీలు రిటైల్ ఔట్ లెట్లకు ఇంతకుముందులా క్రెడిట్ ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. దాంతో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు రిటైల్ ఔట్ లెట్ల మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలని బాబు కోరారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే అనుమతుల విషయం పునరాలోచన చేయాల్సి వస్తుందని బాబు తీవ్రంగా హెచ్చరించారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని బాబు స్పష్టం చేశారు. ప్రతీ బంక్ దగ్గర రెవెన్యూ పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు అలాగే సీసీ కెమేరాల ద్వారా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎక్కడా బ్లాక్‌లో అమ్మకాలు జరగకూడదని చెప్పారు.రాష్ట్రంలో ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని చెప్పారు.
