చంద్రబాబులో ఊహించని మార్పు..! ఉద్యోగ వర్గాల్లో విస్తృత చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఉద్యోగుల్లో ఇన్నాళ్లు ఒక అభిప్రాయం ఉండేది. చంద్రబాబు చాలా సీరియస్ గా, విధినిర్వహణలో సిన్సియర్ గా ఉంటారని చెప్పేవారు.
By: Tupaki Political Desk | 19 Oct 2025 10:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఉద్యోగుల్లో ఇన్నాళ్లు ఒక అభిప్రాయం ఉండేది. చంద్రబాబు చాలా సీరియస్ గా, విధినిర్వహణలో సిన్సియర్ గా ఉంటారని చెప్పేవారు. ప్రభుత్వాధినేతగా నిర్మొహమాటంగా పనిచేయడమే కాకుండా. ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే చెడ్డపేరూ తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేసిన చంద్రబాబు.. తొలి రెండు విడతల్లో ఉద్యోగులను హడలెత్తించేవారు. ఆకస్మిక తనిఖీలతో ఉద్యోగులకు సింహస్వప్నంగా మారడమే కాకుండా సస్పెన్షన్లతో ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవారు. ఇక 2014లో మూడోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అంతకుముందు అంత కఠినంగా వ్యవహరించకపోయినా, ఉద్యోగుల పనితీరు విషయంలో సీరియస్ గానే వ్యవహరించేవారని చెబుతున్నారు.
ప్రస్తుతం నాలుగో సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో పోల్చిచూస్తున్న ఉద్యోగులు.. చంద్రబాబులో మరో కోణాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాలతో సుమారు రెండు గంటల పాటు చర్చించిన సీఎం చంద్రబాబుపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశంసలు కురిస్తున్నారు. 30 ఏళ్లుగా తాము చూస్తున్న చంద్రబాబు ఇతనేనా.. ఒకసారిగా ఇలా ఎలా మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అంతలా విస్మయం చెందడానికి కారణం చంద్రబాబు ప్రవర్తనలో సమూలంగా వచ్చిన మార్పేనంటున్నారు.
నిజమే చంద్రబాబు అంటే ఎప్పుడూ సీరియస్ గా పనిచేసుకునే నేత, అధినేతగానే అందరికీ తెలుసు. ఆయనతో చనువుగా మాట్లాడటం అంటే పెద్ద సాహసమే.. చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పనిచేసిన వారు సైతం ఆయనను బాస్ లా భావించడమే కానీ ఓ ఫ్రెండులా తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటాయని అంటారు. ప్రభుత్వాధినేతగా ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండటానికి ఇలాంటి వైఖరే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. తన చుట్టూ ఉన్నవారి సాదకబాధలను తెలుసుకోవడంలో చంద్రబాబు విఫలం అవడం వల్లే ఆయన రెండోసారి వరుసగా గెలిచే చాన్స్ కోల్పోయేవారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తున్న చంద్రబాబులో అలాంటి వైఖరి ఏ మాత్రం కనిపించడం లేదని అంటున్నారు.
ఉద్యోగుల ఆర్థికాంశాలపై శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తమ సమస్యలు పరిష్కరిస్తారని 16 నెలలుగా ఉద్యోగులు ఎదురుచూస్తూ వస్తున్నారు. కానీ, ఆయన ముందుకు వెళ్లి తమ గోడు చెప్పడానికి వెనుకంజ వేశారు. పత్రికల ద్వారా తమ బాధలు చెప్పుకోవడమే కానీ, నేరుగా ముఖ్యమంత్రిని ఇంతవరకు కలవలేదు. కానీ, ఎవరూ ఊహించని విధంగా శనివారం ఆకస్మాత్తుగా ప్రభుత్వం నుంచి వర్తమానం రావడం, 14 సంఘాల వారిని పిలిచి చర్చించడం ముఖ్యమంత్రి చంద్రబాబులో వచ్చిన మార్పునకు నిదర్శనమంటున్నారు.
సుమారు రెండు గంటల పాటు సమయం కేటాయించి, ఉద్యోగ సంఘాల నేతలు చెప్పినవన్నీ సావదానంగా విన్న చంద్రబాబు.. ప్రభుత్వ ఇబ్బందులను వారికి తెలియజేసి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా తమ స్నేహితుడి మాదిరిగా చర్చించడం చూసి.. తాము గతంలో చూసిన చంద్రబాబు ఇతనేనా? అన్న ఆశ్చర్యపోయారని అంటున్నారు. చంద్రబాబులో ఈ మార్పు ఊహించలేదని అంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతల్లో చాలా మంది 25 నుంచి 30 ఏళ్లుగా సర్వీసులో కొనసాగుతున్నవారే.. వీరంతా చంద్రబాబును చిరకాలంగా చూస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎరిగిన చంద్రబాబు... ఇప్పుడు మాయమయ్యారని సాధారణంగా సాదాసీదాగా ఉంటూ తమతో మాట్లాడటాన్ని మరచిపోలేకపోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
