ఏపీకి 'పూర్వోదయం'..: చంద్రబాబు!
తాజాగా మరో 15 రోజుల్లో పూర్వోదయ పథకానికి సంబంధించిన ప్రణాళికలు, నిధులను కేంద్రం విడుదల చేయనుంది.
By: Garuda Media | 9 Dec 2025 10:16 PM ISTకేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నా రు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన 78 కేంద్ర ప్రాయోజిత పథకాలను ప్రస్తుత కూటమి సర్కారు హయాంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు తాజా కేంద్రం ప్రవేశ పెట్టిన(గత బడ్జెట్‌లో) `పూర్వోదయ` పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకుందా మని చంద్రబాబు స్పష్టం చేశారు. తద్వారా ఏపీకి పూర్వోదయం(సరికొత్త ఉదయం) వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఈపథకంపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పూర్వోదయ పథకాన్ని అమలు చేసుకోవడం ద్వారా.. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవానికి 2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పూర్వోదయ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. దీనిలో ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో వాస్తవానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే.. పూర్వోదయ అనేది దక్షిణాది రాష్ట్రాలకు భిన్నమైన రాష్ట్రాలలో వర్తించేలా పథకాన్ని రూపొందించారు. కానీ, అప్పట్లో చంద్రబాబు విజ్ఞప్తి మేరకు పూర్వోదయలో ఏపీని కూడా చేర్చారు.
తాజాగా మరో 15 రోజుల్లో పూర్వోదయ పథకానికి సంబంధించిన ప్రణాళికలు, నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన చంద్రబాబు.. పూర్వోదయ ద్వారా.. ఏపీలోని మూడు ప్రాంతాలను డెవలప్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేందుకు కేంద్రం ఇవ్వనుంది.
ఏయే ప్రాంతంలో ఏయే అభివృద్ధి..
+ ప్రకాశం సహా, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రం ఏర్పాటు చేస్తారు.
+ పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా రూ.40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.
+ రూ.20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఇస్తారు.
+ మరో రూ.20 వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపడతారు.
+ రూ.5 వేల కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తారు.
