పోలవరానికి ముహూర్తం పెట్టిన బాబు
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు 88 శాతం దాకా పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయి.
By: Satya P | 6 Jan 2026 11:21 PM ISTఏపీని అభివృద్ధి దిశగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తాను అనుకున్న విధంగా సమగ్రమైన ప్రగతిని ఏపీలో చూడాలని బాబు పడుతున్న ఆరాటానికి తపనకు పరిస్థితులు సైతం కలసి వస్తున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర నుంచే అభివృద్ధి స్టార్ట్ అయింది. భోగాపురం ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్టు ఈ ఏడాది జూన్ 26న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం జరుపుకోనుంది. దాంతో ఉత్తరాంధ్రాలో అనూహ్యమైన అభివృద్ధి సాధ్యపడనుంది. దాంతో ఏపీ ప్రభుత్వం మిగిలిన ప్రాజెక్టుల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
పోలవరం కల తీరేది :
ఇప్పటికి 84 ఏళ్ళ క్రితం నాటి కల పోలవరం. 1940 బ్రిటిష్ ప్రభుత్వం వారి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు వెళ్ళాయి. అయితే ఆనాడు జరగలేదు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు గడచినా కూడా పోలవరం విషయమో ఎందుకో విపరీతమైన జాప్యం జరిగింది. అయితే ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్ట్ కల కాదు నిజం అన్నది కూటమి ప్రభుత్వం నిరూపించబోతోంది. దాంతో పోలవరం ప్రాజెక్ట్ ని చూసే అదృష్టం ఈ తరానికి దక్కబోతోంది.
తుది దశకు నిర్మాణం పనులు :
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు 88 శాతం దాకా పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయి. గడచిన 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇక మొత్తంగా చూస్తే ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో ఆ ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా పనులలో వేగం పెంచుతున్నారు.
బాబు సమీక్ష :
ఇక చూస్తే బుధవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఆయన స్వయంగా నిర్మాణం పనుల పురోగతిపై పరిశీలన చేస్తారు. పోలవరం ప్రాజెక్టు వద్దే అధికారులతో సీఎం సమీక్ష కూడా ఉంటుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను చంద్రబాబు పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా ఆయన పరిశీలించనున్నారు.
ముహూర్తం అపుడే :
ఇక పోలవరం ప్రాజెక్ట్ 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎందుకంటే గోదావరి పుష్కరాలు అదే ఏడు వస్తున్నాయి. దాంతో పుష్కరాల కంటే ముందే ప్రాజెక్ట్ ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని బాబు చూస్తున్నారు. అదే జరిగితే భోగాపురం పోలవరం వరసగా ఏపీ ప్రజలకు వరాలుగా మారనున్నాయి. అమరావతి 2028లో పూర్తి అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కోస్తాతో పాటు సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది.
