Begin typing your search above and press return to search.

ఎన్డీయేలో బాబు కీలకం అవుతున్నారా ?

జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితమే కీలకంగా మారారు. అది 1996.

By:  Satya P   |   3 Aug 2025 11:27 PM IST
Chandrababu Naidu: The Kingmaker Returns to National Politics
X

జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితమే కీలకంగా మారారు. అది 1996. అప్పట్లో దేశంలో లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఏపీలో పాతిక కంటే ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకున్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీని అధికారంలోకి రానీయకుండా అలాగే కాంగ్రెస్ ని కట్టడి చేస్తూ ప్రాంతీయ పార్టీలతో తటస్థ పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ కట్టింది. అలా బాబు కేవలం నాలుగున్నర పదుల వయసులోనే జాతీయ రాజకీయాల్లో కొత్త రాజకీయ ఆల్టర్నేషన్ ని ఏర్పాటు చేసి తన రాజకీయ పటిమను చాటుకున్నారు.

బీజేపీ వెనక ఆయనే :

మరో వైపు చూస్తే వాజ్ పేయ్ ఒక్క ఓటుతో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం జత కలిసింది. అలా కేంద్రంలో బీజేపీతో కలసి ఎన్డీఎయే ప్రభుత్వం సుస్థిరంగా ఏర్పాటు అయ్యేందుకు బాబు నిర్వహించిన పాత్ర కూడా గొప్పది అని అంతా గుర్తు చేసుకుంటారు. అలా దాదాపుగా అయిదేళ్ళ పాటు వాజ్ పేయి ప్రధానిగా దేశ రాజకీయాల్లో కొనసాగడానికి టీడీపీ ఇచ్చిన మద్దతు కీలకంగా మారింది.

మోడీతో జోడీ కట్టి :

అదే విధంగా చూస్తే కనుక 2014లో దేశ రాజకీయాలు మారుతున్న నేపథ్యం ఉంది. రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే మీద అసంతృప్తి ఉంది. జాతీయ రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ అపుడే వచ్చారు. ఈ సమయంలో టీడీపీ బీజేపీ పొత్తు ఉమ్మడి ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అలా మోడీ బాబు జోడీ అన్న ప్రచారమూ పాపులర్ అయింది.

అదే రిపీట్ చేసిన నేపథ్యం :

ఇక 2024 ఎన్నికల్లో మరోసారి మోడీ బాబు జోడీ రిపీట్ అయి ఘన విజయాన్ని అందుకుంది. కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని కావడానికి ఏపీ నుంచి టీడీపీ ఎంపీలే కీలకంగా మారారు. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు లేకపోవడంతో జాతీయ స్థాయిలో చంద్రబాబు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఎన్డీయేలో చూసుకుంటే ఆయన చోదక శక్తిగా మారారు అని అంటున్నారు.

ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యల వేళ :

ఇటీవల ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలే చేశారు. 75 ఏళ్ల వయసు నిండిన వారు రాజకీయాల నుంచి హుందాగా తప్పుకుంటే మేలు అని ఆయన సూచించారు. దాంతో మోడీ మీదనే ఈ వ్యాఖ్యలు అని అంతా చర్చించుకున్నారు. ఎందుకుంటే మోడీయే మరో నెలలో 75 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే మోడీని తప్పిస్తే కనుక ఆర్ఎస్ఎస్ మదిలో ప్రధాని పీఠం అధిరోహించే వారు ఎవరు ఉన్నారు అన్న చర్చ ఒక వైపు సాగుతూనే ఉంది. చాలా పేర్లు సంఘ్ దృష్టిలో ఉన్నాయని అంటున్నారు. అందులో చూస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చాన్స్ రావచ్చు అన్నది కూడా ఉంది. ఆయన సంఘ్ కి అతి సన్నిహితుడు అని చెబుతారు. ఇక ఆయన నాగపూర్ కి అతి సమీపంలో ఉంటారని అంటారు. దాంతో నితిన్ గడ్కరీ ఏపీలో తాజా పర్యటాలో చంద్రబాబుతో మెలిగిన తీరు కానీ బాబుని ఆకాశాన్ని ఎత్తేసిన వైనం కానీ చూసిన వారు ఎన్డీయేలో బాబు కీలకం అవుతున్నారు అని అంటున్నారు.

మిత్రుల పాత్ర ప్రధానం :

ఎండీయేలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేని సందర్భంలో ఒకవేళ మోడీని కనుక పక్కకు పెట్టాలని సంఘ్ అనుకున్నా లేక మోడీ తానే తప్పుకున్నా కూడా ఆయన వారసుడి విషయంలో ఓటేయాల్సింది మిత్రులే అని అంటున్నారు. అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఆ పాత్ర పోషిస్తారు అని చెబుతున్నారు. అందునా రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన చంద్రబాబు ఎన్డీయేలో మరింతగా కీలకం అవుతారని అంటున్నారు. నిజానికి చూస్తే జాతీయ రాజకీయాల మీద బాబు ఆసక్తి చూపించడం లేదు. మోడీయే మరో నాలుగేళ్ళ పాటు కొనసాగాలని కూడా టీడీపీ కోరుకుంటోంది అని అంటున్నారు. అయితే అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడితే మాత్రం బాబు పాత్రనే చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని అంటున్నారు. ఇక బీజేపీలో ప్రధాని రేసులో ఉన్న నాయకులు అంతా బాబుతో సాన్నిహిత్యం నెరిపేందుకు ఉత్సాహం చూపించడం వెనక కూడా చాలా విషయాలు ఉన్నయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.