ఫస్ట్ టైం మిస్ కొట్టిన చంద్రబాబు...అక్కడ నుంచే అంతా !
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి మిస్ కొడుతున్నారు. అది కూడా తాను అత్యంత ప్రియంగా భావించే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కి ఆయన ఈసారి హాజరు కావడం లేదు.
By: Satya P | 30 Dec 2025 1:09 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి మిస్ కొడుతున్నారు. అది కూడా తాను అత్యంత ప్రియంగా భావించే ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కి ఆయన ఈసారి హాజరు కావడం లేదు. ఎన్టీఆర్ పించన్ భరోసా కార్యక్రమానికి ఈసారి బాబు రావడం లేదు. ఆయన ఈ సమయంలో విదేశాలలో ఉండనున్నారు దాంతో బాబు లేకుండానే మొదటిసారి ఏపీలో సామాజిక పెన్షన్ పంపిణీ సాగనుంది. చంద్రబాబు 2024 జూన్ 12న నాలుగవ సారి ఏపీకి సీఎం అయిన తరువాత జూలై 1న ఆయన జిల్లాలకు వెళ్ళి పేదల ఇంటి వద్ద తానే స్వయంగా వారికి పెన్షన్ పంపిణీ చేశారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. ప్రజా వేదిక మీద నుంచి ప్రసంగం చేశారు. అది గత 18 నెలలుగా అలవాటుగా మారిపోయింది. ప్రతీ నెలా ఠంచనుగా క్రమం తప్పకుండా బాబు ఈ విధంగా చేస్తూ వచ్చారు. భారీ ఎండలు అయినా తుఫాన్ అయినా ఆయన లెక్క చేసేవారు కాదు, ఒకటో తేదీ వచ్చిందంటే ఫలనా జిల్లా అని ఆయన ఎంచుకుని మరీ అక్కడికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసేవారు. ఇది ఒక ట్రెండ్ గా క్రియెట్ చేశారు.
ఈసారి కుదరదు :
అయితే బాబు ఫస్ట్ టైం 2026 జనవరి పెన్షన్ల పంపిణీలో తాను స్వయంగా పాల్గొన లేకపోతున్నారు. ఈసారి అది కుదిరే అవకాశాలు లేవు ఎందుకంటే చంద్రబాబు ఈసారి కొత్త ఏడాది వేడుకలకు విదేశాలకు వెళ్తున్నారు. ఆయన ఈ నెల 30న బయలుదేరి విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు ఆయన విదేశాలలోనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.
యూరప్ టూర్ లో బాబు :
ఇక చంద్రబాబు యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. తన కుటుంబ సభ్యులు అందరితో కలసి ఆయన అక్కడ సేద తీరనున్నారు. కాసేపు రాజకీయాలను బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి మరీ ఆహ్లాదకరంగా గడపనున్నారు. తిరిగి చంద్రబాబు జనవరి 4వ తేదీన ఏపీకి రానున్నారని తెలుస్తోంది. అంటే బాబు ఏకంగా ఆరు రోజుల పాటు ఏపీలో ఉండరు అన్న మాట.
పాలన అక్కడ నుంచే :
అయితే చంద్రబాబు యూరప్ టూర్ లో ఉన్నా కూడా పాలన అంతా అక్కడ నుంచే కొనసాగిస్తారు అని అంటున్నారు. పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే బాబు ఈ విదేశీ టూర్ చేయబోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఉంది. దాంతో ఎవరు ఎక్కడ నుంచి అయినా పాలన చాలా ఈజీగా సాగించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ రోజుల తరబడి విదేశాలలో ఉన్నా పాలన అంతా సాఫీగానే సాగుతోంది. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే చేస్తున్నారు. ఇక టెక్నాలజీ పరంగా ఎంతో ముందుండే బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. సో బాబు యూరప్ లో ఉన్నా పాలన ఆయన చేతిలోనే ఉంటుంది. స్టీరింగ్ ఆయన దగ్గరే ఉంటుంది. ఆ బెంగ అయితే ఎవరికీ అవసరం లేదని అంటున్నారు. మొత్తానికి న్యూ ఇయర్ 2026 ని బాబు యూరప్ నుంచి ఆహ్వానిస్తారు అని అంటున్నారు.
