దటీజ్ చంద్రబాబు : మంత్రుల మనసులో మాట
ఇక రిఫార్మర్ అనే పదానికి రాజకీయాల్లో నిజమైన నిర్వచనం చంద్రబాబు అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.
By: Satya P | 1 May 2026 4:00 AM ISTముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మీద సాధారణంగా సభలలో పొగుడుతూ ఉంటారు. వేదికల మీద ఎన్నో రకాలుగా కీర్తిస్తుంటారు. అయితే ఒక ఆత్మీయ సమావేశంలో మాత్రమే ఎవరైనా మనసులో మాటలను విప్పి చెప్పగలరు. అలా ఒకరు కాదు అనేక మంది మంత్రులు చంద్రబాబు గురించి తాము ఏమి అనుకుంటున్నది మాటల ద్వారా వ్యక్తం చేశారు. బాబు అంటే తమకు ఏ విధంగా భయం భక్తి అలాగే ఆయన నుంచి నేర్చుకున్న స్పూర్తి ఉన్నదో విడమరచి చెప్పారు. మొత్తానికి మంత్రులు అందరూ చెప్పిన మాటలను విన్న తరువాత దటీజ్ చంద్రబాబు అనిపించకమానదు.
బాబు ఇచ్చిన విందులో :
ఇదిలా ఉంటే ఇటీల బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు చంద్రబాబుకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ విందులో చంద్రబాబు కంటే మంత్రులే ఎక్కువగా మాట్లాడారు. వారే తమ బాబు గురించి తాము ఏమి అనుకుంటున్నది చక్కగా చెప్పారు. పెట్టుబడులు రాబట్టే విషయంలో చంద్రబాబు తమను పరుగులు పెట్టిస్తున్నారని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చెప్పడం విశేషం. అంతే కాదు పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ చేసేంత వరకు విశ్రమించవద్దని చంద్రబాబు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారని ఆయన తెలిపారు. ఇలా బాబు సూచనలతో పరిశ్రమలు గ్రౌండింగ్ చేసేందుకు గ్యాప్ రాకుండా ఉండేందుకు 90 మంది వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని పనిచేస్తున్నామని ఆయన చెప్పడంతో అక్కడ నవ్వులు విరిసాయి.
బాటలు వేసిన బాబు :
అదే విధంగా ఏపీలో ఇంజనీరింగ్ విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులున్న రోజులలో ఇంజనీరింగ్ కాలేజీలతో రాష్ట్రాన్ని నింపి నాలెడ్జ్ ఎకానమీకి చంద్రబాబు బాటలు వేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. పట్టిసీమను ఒట్టిసీమ అని బాబు నిర్ణయాన్ని ఆనాడు విమర్శించారని కానీ అదే పట్టిసీమ ఈ రోజున 50 వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించిందని దటీజ్ చంద్రబాబు అంటూ నిమ్మల చేసిన స్వీట్ కామెంట్స్ సైతం ఈ ఆత్మీయ విందులో అలరించాయి. బాబు నేతృత్వంలో రికార్డు స్థాయిలో హంద్రీ నీవా జలాలను రాయలసీమకు తీసుకెళ్లామని నిమ్మల వివరించారు.
బాబుకు భయపడ్డా :
ఇక మరో మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తాను చంద్రబాబుకు భయపడ్డాను అని చెప్పి సమావేశంలో ఆసక్తిని పెంచారు. సింగపూర్ దేశానికి అధ్యయనం చేసేందుకు వెళ్లినప్పుడు తిరిగి వెళ్లాక చంద్రబాబు ఏం అడుగుతారోననే భయంతో ఆ దేశంలో ఏడు రోజులపాటు క్లాసులకు అటెండ్ అయ్యామని మంత్రి నవ్వుతూ చేసిన కామెంట్ తో బాబుతో సహా అంతా ఎంజాయ్ చేశారు. తాను చదువుకునే రోజుల్లో కూడా కాలేజీకి సరదాగా వెళ్లేవాడినని, సింగపూర్ పర్యటనలో మాత్రం భుజాన బ్యాగ్ వేసుకుని సీరియస్‌గా క్లాసులకు హాజరయ్యామంటూ సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
మోడీని ఎలా ఒప్పించారో :
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలని నిర్ణయించుకున్న కేంద్రాన్ని ఒప్పించి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు బాబు తీసుకుని వచ్చారని ఇది అసాధారణ పరిణామం అని సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంత పెద్ద నిర్ణయంలో ఏం చెప్పి ప్రధాని మోడీ మనసుని బాబు మార్చారో తెలియదని ఆయన చెప్పడంతో సమావేశంలో నవ్వులు విరిసాయి.
రిఫార్మర్ కి మరో పేరు :
ఇక రిఫార్మర్ అనే పదానికి రాజకీయాల్లో నిజమైన నిర్వచనం చంద్రబాబు అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. బాబు రిలాక్స్ కాకుండా నిరంతరం తాను పని చేయడంతో పాటు తన టీమ్ ని కూడా అలాగే పని చేయాలని.చెబుతారని అన్నారు. అప్పుడే అభివృద్ధిసంక్షేమం అందించగలమని తరచూ ఆయన చెబుతారన్న మంత్రి దుర్గేష్ చెప్పుకొచ్చారు. ప్రతీ మంత్రి బాబులోని ఒక్కో కోణం గురించి చెబుతూంటే ముఖ్యమంత్రి అన్నీ వింటూ ఆనందించారు. అయితే మంత్రులు చెప్పిన ఈ విషయాలు అన్నీ చూస్తే బాబు నాయకత్వం ఎలాంటిది ఆయన విజన్ ఏమిటి అన్నది అందరికీ అర్థం అవుతుంది.
