Begin typing your search above and press return to search.

ఏ ముఖ్యమంత్రికీ లేని రికార్డు బాబు సొంతం !

చంద్రబాబు అదృష్టవంతుడు. ఈ మాట ఎందుకు అనడం అంటే ఎంత ప్రతిభ ఉన్నా ఎంత కష్టపడే తత్వం ఉన్నా కూడా అవకాశాలు లభించడం విషయంలో కూసంత అదృష్టం ఉండాలి.

By:  Satya P   |   31 Aug 2026 7:19 PM IST
ఏ ముఖ్యమంత్రికీ లేని రికార్డు బాబు సొంతం !
X

చంద్రబాబు అదృష్టవంతుడు. ఈ మాట ఎందుకు అనడం అంటే ఎంత ప్రతిభ ఉన్నా ఎంత కష్టపడే తత్వం ఉన్నా కూడా అవకాశాలు లభించడం విషయంలో కూసంత అదృష్టం ఉండాలి. దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం ఆశ పెట్టుకున్న వారు ఉన్నారు. నెల రోజుల పాటు కూర్చీ అధిష్టించిన వారు ఉన్నారు. ఎంతో ప్రజాదరణ ఉన్నా కూడా ఎక్కువ కాలం పని చేయలేని సీఎం లు ఉన్నారు. అంతే కాదు అన్ని రకాలుగా బలం ఉండి కూడా సీఎం సీటులో ఒక్క రోజు కూడా కూర్చునే చాన్స్ మిస్ అయిన వారూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం సీఎం గా పనిచేసిన చరిత్ర చంద్రబాబుదే. ఆయన వ్యూహాలు రాజకీయ చాతుర్యం ఇవన్నీ కూడా అధికార పీఠానికి చేరువ చేశాయని చెప్పవచ్చు. కానీ అవకాశాలు దక్కడం అంటే మాత్రం అదృష్టం ఎంతో కొంత ఉండాలని అంటారు. ఆ విధంగా చూస్తే ముఖ్యమంత్రిగానే కాదు పరిపాలన పరంగా అభివృద్ధి పరంగా బాబుకు దక్కినంత అదృష్టం అవకాశాలు మరే సీఎం కి లభించలేదు అని గట్టిగా చెప్పవచ్చు.

వెలిగొండ ఒక ఉదాహరణ :

తాజాగా చూస్తే అతి పెద్ద ఉదాహరణ వెలిగొండ సాగు నీటి ప్రాజెక్టు. ఇది 1996లో శ్రీకారం చుట్టబడిన ప్రాజెక్ట్. అంటే ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం అన్న మాట. రాజకీయాల్లో చూస్తే ఇది సుదీర్ఘమైన కాలం. ఎందుకంటే ఒక్క సెకన్ ఆలస్యం అయితే ఎన్నో మారిపోయే అతి పెద్ద మాయాజాలం రాజకీయ ప్రపంచం. అలాంటి రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి తానే శ్రీకారం చుట్టిన ఒక పెద్ద ప్రాజెక్ట్ తానే మళ్లీ పూర్తి చేసి ప్రారంభించడం అంటే అంతకంటే అదృష్టం వేరొకటి ఉండదు అని చెప్పాలి. అది బాబుకే దక్కిన వరంగా చూడాలి. ఇది ఒక్కటే కాదు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం కూడా ఒక అదృష్టం అవకాశంగా చూడాల్సి ఉంది.

పోలవరం సైతం :

అంతేనా అంటే ఇంకా చాలా ఉంది. పోలవరం ప్రాజెక్టు అన్నది ఆంధ్రుల చిరకాల స్వప్నం. ఒక విధంగా చెప్పాలంటే వందేళ్ల కల. 1930, 1940ల నుంచి నలుగుతున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ కూడా తొలి దశ పనులు 2027 మొదటి అర్ధ భాగం నాటికి పూర్తి చేసుకుని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పోలవరం విషయంలో ఏకంగా పదుల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఎవరికీ దక్కని అదృష్టం ఈ విధంగా బాబుకు లభించబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే అపూర్వమైన కార్యక్రమంలో బాబు పాల్గొనబోతున్నారు. ఆ విధంగా ఆయన అపర భగీరధుడిగా ఏపీ చరిత్రలో నిలవనున్నారు అని గట్టిగా చెప్పాల్సి ఉంది.

రాజధాని నిర్మాతగా :

ఇక మరో సువర్ణ అవకాశం బాబుకు దక్కింది. అదే రాజధాని నిర్మాణం. ఇది అసాధారణమైన విషయంగా చూడాలి. ఏ పరిపాలకుడికీ దక్కని వైనంగా భావించాలి. రాజధాని నిర్మాతలుగా గతంలో రాజులు కనిపించేవారు. అప్పట్లో రాచరికం వల్ల వారే సుదీర్ఘ కాలం ఉంటారు కాబట్టి వారి హయాంలో అవి పూర్తి అయ్యేవి. అయినా అప్పటి రాజ్యాలు భౌగోళికంగా చూస్తే చిన్నవి. కాబట్టి రాజధానులు కూడా చిన్నవి. కానీ ఏపీ భౌగోళికంగా పెద్దది. అలాంటి ఒక రాష్ట్రానికి రాజధాని ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య యుగంలో నిర్మించి తొలి దశను జాతికి అంకితం చేసే సందర్భం కూడా బాబుకు దక్కడం అంటే ఆయన అదృష్టాన్ని ఇక్కడ కూడా తలచుకోక తప్పదని అంటున్నారు.

ఇవన్నీ కూడా :

ఇక బాబు ఎంతటి అదృష్టవంతుడు అంటే ఆయన హయాంలో మూడు సార్లు గోదావరి పుష్కరాలు రెండు సార్లు కృష్ణా పుష్కరాలు జరపడం. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఒక పుష్కరాన్ని కూడా తమ పాలనలో జరప లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పుష్కరాలు పన్నెండేళ్లకు ఒకసారి వస్తాయి. ముఖ్యమంత్రుల పదవి అయిదేళ్ళే ఉంటుంది. అంటే ఎవరైతే అధికారంలో సుదీర్ఘంగా కొనసాగే చాన్స్ ఉంటుందో వారికే ఈ బంగారు అవకాశం దక్కుతుంది అన్న మాట. అది కూడా కరెక్ట్ గా పుష్కరాల సమయంలో సీఎం గా ఉండడం అంటే ఆధ్యాత్మికంగా కూడా యోగం ఉండాలని అంటారు. అది బాబుకు అధికంగా ఉందని చెప్పాలి. ఆయన హయాంలో తొలిసారిగా 2003లో గోదావరి పుష్కరాలు నిర్వహించారు తిరిగి ఆయన సీఎం గా 2015లో నిర్వహించారు. ఇపుడు 2027లో నిర్వహిస్తున్నారు. అలాగే కృష్ణా పుష్కరాలు 2016లో బాబు హయాంలో నిర్వహించారు. ఇపుడు 2028లో నిర్వహించబోతున్నారు. ఇవన్నీ చూసినపుడు బాబు మామూలు జాతకుడు కాదు మహర్జాతకుడు అంటే అందులో అతిశయోక్తి ఏముంటుంది.