Begin typing your search above and press return to search.

చంద్రబాబు కెరీర్ లో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు.. తాజా అవార్డుతో మరో మలుపు!

అదేవిధంగా 2017లో 'గ్లోబల్ లీడర్‌షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్' కేటగిరీలో గోల్డెన్ పీకాక్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు.

By:  Tupaki Political Desk   |   18 Dec 2025 5:49 PM IST
చంద్రబాబు కెరీర్ లో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు.. తాజా అవార్డుతో మరో మలుపు!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేస్తున్నట్లు ప్రతిష్ఠాత్మక ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు, భారీ ఇన్వెస్ట్‌మెంట్లు, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలకు గానూ చంద్రబాబును ఈ అవార్డుతో గౌరవిస్తున్నట్లు ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది. చంద్రబాబు ధైర్యంగా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అభినందించింది. ఇక చంద్రబాబుకు అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ‘‘స్టేట్ ఆఫ్ ది మ్యాటర్: నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్’’ అనే శీర్షికతో సీఎం పనితీరుపై ప్రత్యేక కథనం ప్రచురించింది.

రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న చంద్రబాబుకు ఇలాంటి అవార్డులు రావడం ఇదే తొలిసారి కాదని చెబుతున్నారు. ఆయనకు గతంలోనూ పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారని ప్రచారం జరుగుతోంది. 1996లో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు తన వ్యూహాలతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. తొలుత ఉమ్మడి రాష్ట్రాన్ని 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించి వ్యాపార పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు.

రాజకీయంగా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇమేజ్ మాత్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చెక్కుచెదరలేదని ఆయనకు గతంలో వచ్చిన అవార్డుల ద్వారా తెలుస్తోందని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయిన రెండేళ్లకే 1998లో ‘స్టార్ ఆఫ్ ఏషియా’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఆర్థిక సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను 'బిజినెస్ వీక్' మ్యాగజైన్ చంద్రబాబుకు అప్పట్లో ఆ అవార్డు ప్రకటించింది. ఆ తర్వాత ఏడాది అంటే 1999లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయనను ప్రపంచంలో అత్యుత్తమ నాయకులలో ఒకరిగా గుర్తించి, తన "డ్రీమ్ క్యాబినెట్"లో స్థానం కల్పించింది.

అదేవిధంగా 2017లో 'గ్లోబల్ లీడర్‌షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్‌ఫర్మేషన్' కేటగిరీలో గోల్డెన్ పీకాక్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు. అదేఏడాది ట్రాన్స్‌ఫార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు. తొలి రెండు అవార్డులు చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకోగా, 2017లో మూడోసారి సీఎం అయిన తర్వాత రెండు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం. ఇక 2017లో అంతర్జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికవడానికి ముందు చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు సామర్థ్యానికి దక్కిన గుర్తింపుగా చెప్పొచ్చు. ఇదే సమయంలో జాతీయస్థాయిలోనూ చంద్రబాబుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అందులో ఐటి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఒకటి. 2001లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో సీఎం చంద్రబాబు చూపిన చొరవకు గాను 'డేటా క్వెస్ట్' మ్యాగజైన్ ఐటి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించింది. అదేవిధంగా ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ - బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది.

జాతీయ స్థాయిలో చంద్రబాబు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటూ ఇండియా టుడే పలు సర్వేల్లో ప్రకటించింది. సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడంలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పలుమార్లు వివిధ సర్వేల్లో చంద్రబాబు ఎంపికయ్యారని టీడీపీ చెబుతోంది.

ఇక సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి లోకేష్. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంస్కరణలే మార్గం – పాలనలో విశ్వాసమే మా లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్.