ఢిల్లీలో బాబు...ఏఐలో కీలక ఒప్పందాలు
ఏఐ ఇపుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఏఐ మీద ఎంత అవగాహన ఉండి పట్టు సాధిస్తే వారే ముందుకు సాగుతారు.
By: Satya P | 19 Feb 2026 11:28 PM ISTఏఐ ఇపుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఏఐ మీద ఎంత అవగాహన ఉండి పట్టు సాధిస్తే వారే ముందుకు సాగుతారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏఐ విషయంలో ఉత్సాహాన్ని చూపిస్తోంది. రేపటి తరాన్ని శాసించే ఏఐ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏఐ విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఏపీలో ఏఐ సంస్థాపన లక్ష్యాలను సాధించేలా సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తోంది.
బాబు ఫోకస్ :
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ మండపంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హాజరు అవుతున్నారు. బాబు ఏఐ మీద ఫుల్ ఫోకస్ పెడుతూ ఈ సమ్మిట్ కి వెళ్తున్నారు ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొనున్న చంద్రబాబు అక్కడ ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వరస భేటీలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్న బాబు భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, కలిసి పాల్గొంటారు.
అనేక ఒప్పందాలు :
ఇక ఈ సదస్సులో బాబు పాల్గొన్న తర్వాత రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కీలకమైన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుదుర్చుకోనున్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలలో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఈ సందర్భంగా ఒప్పందం చేసుకోనుంది. అదే విధంగా క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుందని తెలుస్తోంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే బాబు ఢిల్లీ పర్యటనలో ఏఐ ఒప్పందాలు భారీ ఎత్తున కుదరనున్నాయి. ఇవి ఏపీ దశ దిశను మార్చేస్తాయని అంటున్నారు.
