లేఖలు రాసే స్థాయా సర్: నెటిజన్ల విమర్శలు!
ఏపీ సీఎం చంద్రబాబుపై మెజారిటీ ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. ఆయన పాలనను కూడా మెచ్చుకుంటున్నారు.
By: Garuda Media | 16 Sept 2025 9:43 AM ISTఏపీ సీఎం చంద్రబాబుపై మెజారిటీ ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. ఆయన పాలనను కూడా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల సాధన, అమరావతి నిర్మాణం, మెగా డీఎస్సీ, కూటమిని జాగ్రత్తగా కాపాడుకోవడం.. ఉపాధి రంగాలను ప్రోత్సహించడం వంటివిషయాల్లో చంద్రబాబు గతం కన్నా ఎక్కువగా రెచ్చిపోయి మరీ పనిచేస్తున్నారని అన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి. గత 15 మాసాల పాలనలో చంద్రబాబుకు రికార్డులు కూడా దక్కాయి. ప్రజలతో మమేకం కావడంతోపాటు, నెల నెలా తనే స్వయంగా పింఛన్ల పంపిణీ చేపట్టడం వంటివిక్లాస్, మాస్ పీపుల్‌లో గ్రాఫ్ ను పెంచుతున్నాయి.
అయితే.. కొన్నికొన్ని పొరపాట్లను కూడా ప్రజలు అలానే చూస్తున్నారు. ఎంత జాగ్రత్తగా అడుగులు వేసినా.. ఎంత మేధావి అయినా.. ఒక్కొక్కసారి ఒత్తిడి తట్టుకోలేక.. ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రంతో వైరం పెట్టుకుని రోడ్డెక్కడాన్ని.. తెలంగాణ సమాజం జీర్ణించుకోలేక పోయింది. నేను పులిని అని చెప్పుకొన్న సీఎం కేసీఆర్.. కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం అడుగులు వెనక్కి వేసి.. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేశారు. ఇది అప్పటి వరకు ఉన్న గ్రాఫ్‌ను పడేసింది.
అదేవిధంగా.. 2019 ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం.. ధర్నాలు చేయడం.. నల్ల చొక్కాలు ధరించ డం.. సీబీఐని అడ్డుకోవడం వంటివి కూడా.. ప్రజల్లో ఆయనపై ఉన్న సానుభూతిని తగ్గించాయి. ఆ తర్వాతఫలితం ఎలా వచ్చిం దో అందరికీతెలిసిందే. ఇక, ఇప్పుడు తాజాగా.. చంద్రబాబుపై నెటిజన్ల నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. ఇక, యూట్యూబ్‌లో అయితే రీళ్లకు కొదవేలేకుండా పోయింది. దీనికి కారణం.. చంద్రబాబు స్వయంగా కేంద్రానికి ఏడు లేఖలు రాయడం. అమెరికా సుంకాల కారణంగా.. ఆక్వా రంగం దెబ్బతిందని.. ఆదుకోవాలని కోరారు. అదేసమయంలో మరో లేఖలో జీఎస్టీ తగ్గించడం వల్ల వచ్చే లోటును భర్తీ చేయాలని విన్నవించారు.
ఇక, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలని మరికొందరు మంత్రులకు చంద్రబాబు లేఖలు సంధించారు. అయితే.. ఈ లేఖలపై కేంద్రం ఎలా స్పందిస్తున్నంది పక్కన పెడితే.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే.. చంద్రబాబు ఎంపీల మద్దతుతో పాలన సాగిస్తున్నప్పుడు.. అత్యంత కీలకమైన సమయంలో లేఖలు రాసి చేతులు దులుపుకోవడం ఏంటన్నది ప్రశ్న. అంతేకాదు.. ఇటీవల జేపీ నడ్డాకు ఫోన్ చేయగానే.. కాకినాడకు వస్తున్న యూరియాలో 50 వేల టన్నులు తీసుకోవాలని ఆయన చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ యూరియా నేరుగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయింది. ఈ విషయంపైనా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయా అంశాలపై చంద్రబాబు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కేంద్రంతో తాము బలంగా ఉండి కూడా.. ఇలా ప్రాధేయ పడాల్సిన అవసరంఏంటని నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలను తప్పుబట్టకుండా.. కేసులు పెట్టకుండా.. తప్పులు జరగకుండా చూసుకుంటే.. భవిష్యత్తులో ఇంకా మంచి పేరు వస్తుందని అంటున్నారు పరిశీలకులు.
