Begin typing your search above and press return to search.

బాబుకు కరుణానిధితోనే కరెక్ట్ పోలిక

ఏపీ సీఎం చంద్రబాబుకు సమకాలీన రాజెకేయాల్లో సీనియారిటీలో సరితూగే నేత ఎవరూ లేరని చెప్పాలి.

By:  Satya P   |   9 March 2026 9:06 AM IST
బాబుకు కరుణానిధితోనే కరెక్ట్ పోలిక
X

ఏపీ సీఎం చంద్రబాబుకు సమకాలీన రాజెకేయాల్లో సీనియారిటీలో సరితూగే నేత ఎవరూ లేరని చెప్పాలి. దేశంలో కూడా అతి తక్కువ మంది నేతలు మాత్రమే బాబు మాదిరిగా ఉత్సాహంగా ఉన్నారు. ఇక 1970 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ రోజుకీ టాప్ చెయిర్ లో ఉన్న వారు ఎవరూ అంటే ఠక్కున చెప్పే జవాబు ఒక్కటే. అదే చంద్రబాబు అని. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయి ఈ రోజుకీ సీఎం గా ఉన్నారు. దేశ రాజకీయాల్లో చూస్తే 70లలో రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజున యాక్టివ్ గా ఉన్న వారు అయితే ఎవరూ లేరనే చెప్పాల్సి ఉంది. దాంతో బాబు రికార్డు ఇక్కడే అంతా చూస్తున్నారు.

ఊహాగానాలు నిజమా :

ఇదిలా ఉంటే బాబు నాలుగవ సారి ఏపీకి సీఎం గా అయ్యారు. ఆయన ఇరవై ఒక్క నెలల పాలన మాత్రమే పూర్తి చేశారు. కూటమి చేతిలో ఇంకా 39 నెలల పాలన ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి అనేక రకాలైన ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో అదే జరుగుతోంది. బాబు ఉప ప్రధాని అవుతారని కేంద్ర రాజకీయాలకు వెళ్తారని ఆ ప్రచారం సారాంశం. అయితే బాబు మనస్తత్వం కానీ ఆయన రాజకీయ ట్రాక్ రికార్డు చూసిన వారు కానీ దీనిని నమ్మడం లేదు. అవన్నీ ఒట్టి ఊహాగానాలుగా తేల్చేస్తున్నారు.

రాష్ట్రమే ముఖ్యంగా :

బాబు ఈ మధ్యనే ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పినది ఏంటంటే తాను రాష్ట్ర రాజకీయాలోనే కొనసాగుతాను అని. కేంద్ర రాజకీయాలకు వెళ్ళే ప్రసక్తి లేదని. బాబు ఇప్పటికి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఒకసారి ఓటమి చూశారు. మొత్తంగా ఆయన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే తప్ప ఎంపీ పదవికి పోటీ చేసినది లేదు, బాబు రాజకీయ నేపథ్యం ఇంత క్లియర్ గా ఉన్నపుడు ఆయన ఎంపీ గా నెగ్గి జాతీయ రాజకీయాలకు ఎలా వెళ్తారు అని అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు వస్తాయి.

కరుణానిధి మాదిరిగా :

ఇక్కడే బాబుకు తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణా నిధికి మధ్య ఒక పోలిక కనిపిస్తుంది. కరుణానిధి కూడా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తన జీవిత కాలంలో ఆయన ఎపుడూ ఎంపీ పదవికి పోటీ చేసింది లేదు, రాజ్యసభకు నామినేట్ అయింది లేదు. డీఎంకేకు 1991 ప్రాంతంలో కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చినా ఆయన తమిళనాడునే అట్టిబెట్టుకున్నారు. అంతే కాదు తమిళనాడుతోనే తన మొత్తం రాజకీయ జీవితం అని చెప్పేశారు ఆయనను ఢిల్లీ పెద్దలు వచ్చి తమిళనాడులో కలవాల్సిందే తప్ప ఆయన మాత్రం ఢిల్లీకి వెళ్ళింది కూడా లేదని అంటారు. తొంబై ఏళ్ళకు పైగా బతికిన కరుణానిధి తాను జీవించి ఉన్నంతవరకూ సీఎం గా పనిచేశారు. డీఎంకే పార్టీకి సారధ్యం వహించారు. ఆయన కుమారుడు స్టాలిన్ ఇరవై ఏళ్ల నుంచే రాజకీయాల్లో ఉంటూ వారసుడిగా సిద్ధంగా ఉన్నా కరుణానిధి మాత్రం వారసత్వం బాధ్యతలు పాక్షికంగానే అప్పచెప్పారు. అంతా తానే అయి ప్రభుత్వాన్ని పార్టీని నడిపారు. చంద్రబాబు విషయం తీసుకున్నా అదే అనిపిస్తోంది అని అంటున్నారు.

రాష్ట్రం పైనే ప్రేమ :

బాబుకు రాష్ట్రం మీదనే విపరీతమైన ప్రేమ ఉంది అని అంటారు. ఆయన నిరంతరం ఏపీ గురించే ఆలోచిస్తారు. పైగా విభజన ఏపీలో ఎన్నో సమస్యలు సవాళ్ళు ఉన్నాయి. బాబు మాత్రమే వాటిని సాకారం చేయగలరు అని భావించే జనాలు ఓటేశారు. ఇక మిత్ర పక్షం అయిన జనసేన కూడా బాబు పదిహేనేళ్ళు సీఎం గా కొనసాగాలని బలంగా కోరుకుంటోంది. బాబు ఉంటేనే కూటమికి గట్టి నాయకత్వం ఉంటుందని అంతా ఒప్పుకుంటారు. ఇక బాబు నంబర్ వన్ పొజిషన్ లోనే ఉండాలని అనుకుంటారు. ఆయన కేంద్రానికి ఒక వేళ వెళ్ళినా ఒక మంత్రిగా ఉంటారు. మరి బాబుకు అది సాధ్యమేనా అన్నది కూడా మరో ప్రశ్నగా వస్తుంది ఇవన్నీ ఆలోచించినపుడు బాబు ఏపీకే పరిమితం అవుతారు, ముఖ్యమంత్రిగానే ఉంటూ 2029 ఎన్నికలను ఆయన నాయకత్వంలోనే కూటమిని నడిపిస్తారని అంతా బలంగా నమ్ముతున్నారు.