Begin typing your search above and press return to search.

సీఎం ఢిల్లీ టూర్‌: మారిన అజెండా ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకోనున్నారు.

By:  Garuda Media   |   9 Feb 2026 11:04 PM IST
సీఎం ఢిల్లీ టూర్‌:  మారిన అజెండా ..!
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకోనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌హా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ను కూడా చంద్ర‌బాబు క‌లుసుకోనున్నారు. అయితే.. ముందుగా పెట్టుకున్న అజెండా ఇప్పుడు మారిపోయిన‌ట్టు తెలిసింది. తొలుత బీజేపీ నాయ‌కుల వ్య‌వ‌హారంపై చ‌ర్చించేందుకు సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్తున్న‌ట్టు సీఎంవో వ‌ర్గాల ద్వారా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ పై.. టీడీపీ, జ‌న‌సేన స్పందిస్తున్నా.. బీజేపీ నుంచి ఎలాంటి కౌంట ర్లు రాక‌పోవ‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు ఆవేద‌నతో ఉన్నారు. క‌ల‌సి క‌ట్టుగా స‌మ‌స్య‌లు ఎదుర్కొనాల‌న్న‌ది ఆయ‌న సూచ‌న‌. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కూట‌మి నాయ‌కుల‌తోనూ ఆయ‌న ప్ర‌త్యేకంగా బేటీ అయ్యారు. విష‌యంపై చ‌ర్చించారు. అయిన‌ప్ప‌టికీ.. అనుకున్న విధంగా బీజేపీ నేత‌ల నుంచి స్పంద‌న రాలేదు. వారు ఏ విష‌యాన్నీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లేందుకు రెడీగా లేరన్న‌ది స్ప‌స్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలోనే సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు తెర‌దీశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ఆయ‌న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. కూట‌మిలో క‌లివిడి కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న వాద‌న వినిపించింది. కానీ, అనూహ్యంగా ఈ అజెండాను మార్చుకు న్న‌ట్టు తాజాగా తెలిసింది. ప్ర‌స్తుతం క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సీబీఐ నివేదిక ఇవ్వ‌డం, విష‌యం కోర్టు ప‌రిధిలో ఉండడంతో దీనిపై కామెంట్లు చేయ‌డం స‌రికాద‌ని.. బీజేపీ నేత‌లు భావిస్తున్న‌ట్టు తెలిసింది.

ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని కేంద్ర పెద్ద‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లినా.. బ‌లంగా వారిపై ఒత్తిడి చేయ‌రాద‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో చేప‌ట్టిన ప‌థ‌కాలు, కేంద్రం నుంచి రావాల్సిన ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం గ్రాంట్లు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో కొత్త‌గా ఏర్పాటు చేసిన జిల్లాల‌కు అధికారుల నియామ‌కానికి కూడా కేంద్రంతో చ‌ర్చించ‌నున్నారు. సో.. మొత్తంగా ఢిల్లీ అజెండాలో మార్పులు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.