పొలిటికల్ గా హీటెక్కిన వేళ ఢిల్లీకి బాబు !
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మీద విపక్షం యుద్ధం ప్రకటించింది.
By: Satya P | 7 Oct 2026 7:41 AM ISTప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ రాజకీయంగా వేడెక్కి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మీద విపక్షం యుద్ధం ప్రకటించింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి తీరాలని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు అన్నీ ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఒక్క అడుగు ముందుకేసి దేశవ్యాప్తంగా పోరాటానికి శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా తమ డిమాండ్లు సాధించేవరకూ వెనక్కి తగ్గేది లేదని పంతం పట్టింది. దీంతో దేశ రాజధాని ఎండలతో పాటు పొలిటికల్ హీట్ తో ఠారెత్తిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్డీయేలో కీలక మిత్ర పక్ష నేత అయిన చంద్రబాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అదే ఇపుడు ఆసక్తిని పెంచుతోంది.
ఎందుకు ఢిల్లీకి :
చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. ఈ మధ్య కాలంలో ఆయన ఢిల్లీకి పెద్దగా వెళ్లింది లేదు. అయితే ఇపుడు ఆయన ఢిల్లీ బాట పట్టడం అయితే రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ బాబు ఢిల్లీ టూర్ ఎందుకు అంటే ఏపీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడానికే అని అంటున్నారు. ఇక బాబు ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అజెండా ఇదేనా :
ఇక ఆయన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఈ నెల 8వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా సమావేశం అవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర మంత్రితో భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన భూసేకరణతో పాటు పునరావాస ప్యాకేజీ కోసం కేంద్రం నుంచి రావాల్సిన 33 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాలని బాబు కేంద్ర మంత్రిని కోరనున్నట్లుగా చెబుతున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ కీలకమైన నిర్మాణానికి అవసరమైన 2,300 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి మంజూరు చేయించుకోవాలని కూడా బాబు చూస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుసంధాన మౌలిక వసతులకు సంబంధించిన నిధులపై కేంద్రంతో చంద్రబాబు చర్చించనున్నారు.
వర్తమాన అంశాలు :
అయితే బాబు ఢిల్లీ పర్యటనలో వర్తమాన జాతీయ ప్రాంతీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో విపక్షాలు పోరు బాట పట్టడంతో దీని మీద కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ సంతృప్తి చెందింది. హర్షం కూడా వ్యక్తం చేసింది. ఈ కీలక సమయంలో ఎన్డీయే మిత్రుడిగా టీడీపీ ప్రభుత్వం వెంటనే మద్దతుగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. దాంతో ప్రధానితో బాబు భేటీలో అనేక విషయాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు. అలాగే పాతికేళ్ల పాటు అధికార పదవుల్లో ఉన్న ప్రధాని మోడీని ప్రత్యేకంగా బాబు అభినందిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద కీలక సమయంలో చంద్రబాబు చేపడుతున్న ఢిల్లీ పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.
