Begin typing your search above and press return to search.

సిగ్గు అనిపిస్తోంది...బాబు షాకింగ్ కామెంట్స్

ఏపీలో ఈ తరహా రాజకీయం సాగుతోందని బాబు అన్నారు. ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   8 Dec 2025 10:29 PM IST
సిగ్గు అనిపిస్తోంది...బాబు షాకింగ్ కామెంట్స్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీ మీద ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఒక తలా తోకా లేని పార్టీ ఉందని ఆయన వైసీపీని విమర్శించారు. ఆ పార్టీకి విధానాలు లేవని రాజకీయం ముసుగులో ఏమైనా చేయవచ్చని భావించే పార్టీగా ఉందని అన్నారు. తప్పులు వారే చేస్తారు, తప్పులు చేసిన వారిని సైతం సమర్ధిస్తారు అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవుడి విషయంలోనూ :

సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీని గట్టిగా టార్గెట్ చేశారు. తప్పులు సమర్థిస్తున్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పరకామణిలో డబ్బులు కొట్టేసిన వ్యవహారాన్ని చిన్న నేరం అని కామెంట్ చేయడాన్ని ఏమనాలి అని ఆయన ప్రశ్నించారు. ఒక దేవాలయంలో ఈవో చోరీ చేస్తే తక్షణం సస్పెండ్ చేశామని, అలాగే అరెస్ట్ చేయించామని బాబు చెప్పారు. దేవాలయంలో దేవుడి దగ్గర సొమ్మును చోరీ చేస్తే దానిని సమర్ధిస్తారా అని ఆయన వైసీపీ అధినాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే చోరీ జరిగితే అది చిన్నదని ఎలా అంటున్నారు అని నిలదీశారు. గతంలో నాసిరకం ప్రసాదాన్ని భక్తులకు ఇస్తే దానినీ సమర్ధించారని బాబు మండిపడ్డారు. కల్తీ నెయ్యి స్వామివారి ప్రసాదం తయారీకి సరఫరా చేసిన ఘటనను వెనకేసుకు వస్తారా అని ఆయన ఫైర్ అయ్యారు.

సిగ్గు అనిపిస్తోంది :

ఏపీలో ఈ తరహా రాజకీయం సాగుతోందని బాబు అన్నారు. ఇలాంటి వారితో రాజకీయం చేయడానికి నాకు సిగ్గు అనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యన సింగయ్య అనే వ్యక్తిని కారు కింద తొక్కించేసి ఆయన భార్యతోనే మాపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టించారని బాబు గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి మద్యం సేవిస్తూ వచ్చి ప్రమాదంలో ఓ పాస్టర్ మరణిస్తే ఆ ఘటనను కూడా హత్య కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలా చూస్తే కనుక ప్రతీ అంశంలోనూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసిన వ్యక్తుల పై కఠినంగా వ్యవహరిస్తామని బాబు స్పష్టం చేశారు.

ఇండిగో తీరు వల్లనే :

ఇదిలా ఉంటే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటెషన్ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని బాబు చెప్పారు. విమాన ప్రయాణికుల భద్రత పెంచటంలో భాగంగా పైలట్లు, క్రూ సభ్యులకు విశ్రాంతి సమయం ఇచ్చేలా కేంద్రం నిబంధనలు తీసుకుని వచ్చిందని ఆయన అన్నారు. అయితే ఈ విషయంలో ఇండిగో సంస్థ సరిగా వ్యవహరించ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని బాబు చెప్పుకొచ్చారు. ఈ విధంగా జరిగిన పరిణామాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పరిస్థితిని చక్కదిద్దుతోందని బాబు పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ మీద బాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా వేడిని పుట్టించేలా ఉన్నాయని అంటున్నారు.