రెండేళ్ల పాలనపై చంద్రబాబు లెక్కల పత్రం.. అప్పులు, ఆదాయం, అభివృద్ధిపై ప్రజంటేషన్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎస్ హెచ్ జీ (SHG) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.
By: Garuda Media | 4 Aug 2026 4:58 PM ISTకూటమి ప్రభుత్వంలో ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చామని, కొన్ని విషయాల్లో చెప్పినవాటికంటే ఎక్కువగానే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేశారని, తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టినట్లు వివరించారు. పేద, ధనికుల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారతే ధ్యేయంగా వారికి అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఐఐటీ, నీట్, యూపీపీఎస్సీ వంటి దేశస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారత, డ్వాక్రా నెట్‌వర్క్
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎస్ హెచ్ జీ (SHG) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. 2026–27 నాటికి ఏకంగా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, దీనికోసం రూ.2,246 కోట్ల మేర క్రెడిట్ సపోర్ట్ అందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలు రూ.43,219 కోట్ల భారీ రుణాలను పొందగలుగుతున్నారని, అలాగే డ్వాక్రా సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా 'స్వయం' బ్రాండ్‌ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని, దీనివల్ల ప్రజలకు పెద్దఎత్తున మేలు జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. పీపీపీ విధానం ద్వారా సాధిస్తున్న పురోగతిని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
మూలధన వ్యయం పెంపు
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు మూలధన వ్యయం కింద అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 2019-24 మధ్య ఉన్న గత ప్రభుత్వంతో పోలిస్తే, ప్రస్తుతం ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని విషవలయం నుంచి పూర్తిగా 'డెవలప్‌మెంట్ సైకిల్' వైపు తీసుకువెళ్తున్నామని, ఇందుకోసం పూర్తిగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలను అమలోకి తెచ్చినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో వివిధ కీలక ప్రాజెక్టులుకు భారీగా నిధులు వెచ్చించినట్లు సీఎం వివరించారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 10,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి రూ. 8,300 కోట్లు, పోర్టుల అభివృద్ధికి రూ. 5,437 కోట్లు, జల్ జీవన్ మిషన్ పనుల నిమిత్తం రూ. 1,142 కోట్లు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ. 2,302 కోట్లు వెచ్చించామని సీఎం వివరించారు. ఇవి కాకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం ఇప్పటివరకు రూ. 38,800 కోట్లు, రైల్వేల అభివృద్ధి కోసం రూ. 64,417 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు.
తలసరి ఆదాయం - ఆర్థిక అంతరాలు
ఆదాయం రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కు చేరగా, ఏపీ మాత్రం రూ.93,903కు పడిపోయిందని తెలిపారు. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయంలో రూ.30,201 గ్యాప్ ఏర్పడిందన్నారు. రాజధానిని కోల్పోవడం, ఎక్కువ జనాభా ఉండటం, తక్కువ ఆదాయ వనరులతో రాష్ట్రం ఏర్పడటం వల్ల ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీవ్రంగా కష్టపడ్డామన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీ 13.5 శాతంగా ఉండగా, అప్పుల జీఎస్డీపీ రేషియో 28.38 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ద్వారా ఏపీ, తెలంగాణల మధ్య ఉన్న రిసోర్స్ గ్యాప్‌ను 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించి, 2 శాతం మేర పూడ్చగలిగామని వివరించారు.
హామీల అమలు - బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ
2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, 'బ్రాండ్ ఏపీ'ని తిరిగి తీసుకొస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటనూ, ఎవ్వరూ ఊహించని విధంగా, చెప్పిన తేదీల్లోనే సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. ఆదాయం పెరగాలంటే అభివృద్ధి జరగాలనే మూల సూత్రాన్ని నమ్ముతూ ముందుకు వెళ్తున్నామని, రాష్ట్ర ఆర్థిక సుస్థిరత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ కొత్త పాలసీలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 2019–24 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి తీవ్రంగా మందగించిందని, ఒకవేళ 2014–19 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే ఏపీకి అదనంగా రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ వచ్చేదని సీఎం తెలిపారు. 13.5 శాతం వృద్ధి రేటు నిలకడగా ఉంటే అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం సమకూరేదని, రెవెన్యూ పెరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పేదన్నారు.
2019-24 మధ్య విధ్వంసకర పాలన
2019–24 మధ్య కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని చంద్రబాబు విమర్శించారు. అమరావతి పనులు ఆగిపోయాయని, పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ) రద్దుతో వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని, దీనివల్ల రూ.32 వేల కోట్ల భారం పడిందని, రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెరిగిపోయాయని మండిపడ్డారు. విద్యుత్‌ను వినియోగించుకోకుండానే కేవలం చెల్లింపుల రూపంలో రూ.9 వేల కోట్లు వృథా చేశారని సీఎం దుయ్యబట్టారు.
