Begin typing your search above and press return to search.

నెల రోజుల్లో జిల్లాల విభ‌జ‌న‌.. బాబుపై విమ‌ర్శ‌లు

మ‌రీముఖ్యంగా ప్ర‌స్తుతం వివాదంగా ఉన్న అన్న‌మయ్య జిల్లా, ప‌ల్నాడు జిల్లా, శ్రీస‌త్య‌సాయి జిల్లా, కోన‌సీమ‌, మ‌న్యం జిల్లాల ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

By:  Garuda Media   |   7 Aug 2025 8:00 PM IST
నెల రోజుల్లో జిల్లాల విభ‌జ‌న‌.. బాబుపై విమ‌ర్శ‌లు
X

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేవ‌లం నెల రోజుల్లోనే ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న 26 జిల్లా ల‌ను 32 జిల్లాలుగా విభ‌జించ‌డంతోపాటు.. వాటికి కొత్త పేర్లు, రెవెన్యూ డివిజ‌న్ల స‌రిహ‌ద్దుల మార్పు వంటి వి చేసి తీరాల‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం అంత తొంద‌ర‌గా జ‌రుగుతుందా? అనేది సొంత నేత‌లు, మంత్రుల నుంచే ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌. ఇదే విష‌యాన్ని ప‌లువ‌రు ఎమ్మెల్యేలు కూడా ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో వైసీపీ కూడా ఇలానే తొంద‌ర‌ప‌డి.. చేసిన ప‌నికి ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత వ‌చ్చింద‌ని గుర్తు చేస్తున్నారు.

ముఖ్యంగా జిల్లాల స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించ‌డం.. మార్చ‌డం అంటే.. రెండు మూడు జిల్లాల‌కు చెందిన అధికారులు, క‌లెక్ట‌ర్లు క‌లిసి తీసుకోవాల్సిన నిర్ణ‌యం. దీనికి వారు క‌నీసంలో క‌నీసం.. ఐదారు రోజుల పాటు క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంటుంది. అనంత‌రం.. స్థానికుల నుంచి అభిప్రాయ సేకర‌ణ కూడా చేప‌ట్టాలి. వారి అభిప్రాయాలు.. స్థానిక సంస్కృతి, సంప్ర‌దాయాలు.. ప్ర‌ముఖుల పేర్లు, అదేవిధంగా స్థానికుల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని జిల్లాల విభ‌జ‌న చేయాలి. దీనికి ఎంత లేద‌న్నా.. ఐదు నుంచి ఆరు మాసాల స‌మ‌యం ప‌డుతుంది.

మ‌రీముఖ్యంగా ప్ర‌స్తుతం వివాదంగా ఉన్న అన్న‌మయ్య జిల్లా, ప‌ల్నాడు జిల్లా, శ్రీస‌త్య‌సాయి జిల్లా, కోన‌సీమ‌, మ‌న్యం జిల్లాల ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్క‌డ మార్పులు చేర్పులు చేయాలంటే. మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో రెవెన్యూ డివిజ‌న్ల‌ను మార్చాల‌న్నా.. గ్రామ స‌భ‌ల‌ను నిర్వ‌హించి.. స‌రైన నిర్ణ‌యం తీసుకుని ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించాలి. అప్ప‌టికి కానీ.. విభ‌జ‌న ప్ర‌క్రియ చేప‌ట్టే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబుకేటాయించిన నెల రోజుల స‌మ‌యం స‌రిపోద‌ని.. హ‌డావుడిగా నిర్ణ‌యం తీసుకున్నా.. పార్టీకి ఒన గూరే ప్ర‌యోజ‌నం కూడా ఉండ‌ద‌ని చెబుతున్నారు. గ‌తంలో వైసీపీ మాదిరిగా ప‌రిస్థితి మారితే ఇబ్బందులు వ‌స్తాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో క‌నీసంలో క‌నీసం.. నాలుగు మాసాల స‌మ‌యం ఇవ్వాల‌ని ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌చ్చే మార్చి 31 వ తేదీ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చినందున స‌మ‌యం స‌రిపోతుంద‌ని అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు వీరి విన‌తులు ప‌రిశీలిస్తారో లేదో చూడాలి.