'కూటమి' మరింత స్ట్రాంగ్.. చంద్రబాబు తాజా నిర్ణయం!
ఈ నెల 25(క్రిస్మస్)న మాజీ ప్రధాని దివంగత వాజపేయి జయంతి. ఆనాటికి ఆయనకు 100 ఏళ్లు నిండుతాయి. దీంతో శత జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
By: Garuda Media | 10 Dec 2025 5:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వాన్నే కాకుండా.. కూటమి పార్టీల ఐక్యతను కూడా బలోపేతం చేయాలన్న నిర్ణయంతో టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ముందుకు సాగుతున్నారు. అందుకే ఏ వేదిక ఎక్కినా కూటమి ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే 15 ఏళ్లపాటు ప్రభుత్వం పదిలంగా ఉండాలంటే.. కూటమి ఐక్యంగా ఉండాలని నమ్ముతున్నారు. ఇదే విధంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 11 నుంచి బీజేపీ నేతృత్వంలో ప్రారంభం కానున్న `అటల్ సందేశ్-మోడీ సుపరిపాలన` కార్యక్రమంలో టీడీపీ నాయకు లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా అందరూ భాగస్వామ్యం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని.. కూటమి ప్రభుత్వం(కేంద్రంలోనూ.. ఇక్కడా) చేపట్టిన కార్యక్రమంగా అందరూ గుర్తించాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ యాత్ర దేశవ్యాప్తంగా గ్రామం నుంచి మండలం, నగరం, పట్టణాల దాకా సాగనుంది.
ఏంటి విశేషం...
ఈ నెల 25(క్రిస్మస్)న మాజీ ప్రధాని దివంగత వాజపేయి జయంతి. ఆనాటికి ఆయనకు 100 ఏళ్లు నిండుతాయి. దీంతో శత జయంతి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఏడాది పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటల్ సందేశ్-మోడీ సుపరిపాలన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 11 నుంచి 25 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజపేయి.. ప్రస్థానం.. ఆయన దేశానికి చేసిన సేవలు వంటివాటిని వివరించనున్నారు. అదేవిధంగా ఆయన వారసుడిగా ప్రస్తుత ప్రధాని న రేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమాలు, వరుసగా కేంద్రంలో ప్రభుత్వం పాగా వేయడం వంటి అంశాలను కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్తారు.
అదేసమయంలో వికసిత్ భారత్-2047 ప్రాధాన్యం.. సహా.. వచ్చే ఏడాది పాటు అటల్ బిహారీ వాజపేయి సందేశాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని పురస్కరించుకుని ఎన్డీయే కూటమి పార్టీగా.. టీడీపీ కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అటల్ సందేశ్-మోడీ సుపరిపాలనకార్యక్రమాల్లో టీడీపీనాయకులు విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫలితంగా మూడు పార్టీలు(జనసేన-టీడీపీ-బీజేపీ)ల మధ్య మరింత ఐక్యత, అవగాహన పెరుగుతాయని భావిస్తున్నారు.
