Begin typing your search above and press return to search.

ఢిల్లీలో ‘చంద్రబాబే’ హైలెట్: ఆంధ్రప్రదేశ్‌కు 'కింగ్ సైజ్' ఎలివేషన్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది.

By:  A.N.Kumar   |   14 Oct 2025 5:21 PM IST
ఢిల్లీలో ‘చంద్రబాబే’ హైలెట్: ఆంధ్రప్రదేశ్‌కు కింగ్ సైజ్ ఎలివేషన్!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక “భారత్ AI శక్తి” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ - దాని అనుబంధ సంస్థ రైడెన్ (Ryden)తో భారీ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ చారిత్రక ఒప్పందం ద్వారా విశాఖపట్నంలో భారతదేశంలోని తొలి AI హబ్ స్థాపనకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు నాయకత్వానికి, ఆయన దార్శనికతకు జాతీయ స్థాయిలో 'కింగ్ సైజ్' ఎలివేషన్‌ను అందించింది.

* కేంద్ర మంత్రుల ప్రశంసలు: దార్శనికతకు సలాం!

ఈ కీలక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడుకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇద్దరూ కూడా చంద్రబాబు గారి దూరదృష్టి, సృజనాత్మకత, నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు గారి విజన్ నిజంగా దీర్ఘదృష్టికి నిదర్శనం. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇతర రాష్ట్రాలకు లేనంతగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సముద్రతీర సదుపాయాలు, మౌలిక వసతులు, వాటిని పెట్టుబడుల కోసం సద్వినియోగం చేయడంలో చంద్రబాబు గారి వ్యూహం విశేషమైనది” అని కొనియాడారు.

ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. “మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆరు నెలల క్రితం నన్ను కలసి ఈ ప్రాజెక్టు గురించి చర్చించారు. చాలా రాష్ట్రాలు ప్రతిపాదనలు ఇస్తాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం దాన్ని వేగంగా నిజం చేసింది. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందిన భారతదేశ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా కూడా పెద్ద అడుగు” అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులను వేగంగా అమలు చేసే తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

* ఆంధ్రప్రదేశ్‌కు మైలురాయి: లోకేష్ హర్షం

ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ- మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ “ఇది ఆంధ్రప్రదేశ్‌కు మైలురాయి కాబోతోంది. ఈ AI సెంటర్ ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి జరుగుతాయి. ఇది రాష్ట్రానికి చారిత్రాత్మక రోజు” అని తెలిపారు. ఈ AI హబ్ ద్వారా రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

* గమ్యస్థానంగా ఏపీ: డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందంజ

ఒకప్పుడు పెట్టుబడులు ఆకర్షించడంలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ సాంకేతిక దిగ్గజాలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. AI హబ్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందంజలో నిలిచింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కేవలం AI హబ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బలమైన పునాది పడింది.

మొత్తంగా, ఢిల్లీ వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం కీర్తి పీఠంగా మారింది. దేశమంతా ఆయన నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసిస్తూ నిలబడ్డ ఈ సందర్భం, నిజంగా తెలుగు నేతకు జాతీయ వేదికపై 'కింగ్ సైజ్' ఎలివేషన్ అనే చెప్పాలి.