పదిహేనేళ్ళ ప్రస్థానం : బాబు ఈజ్ గ్రేట్
ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు పాలించిన చంద్రబాబు ఆనాడు తన దృష్టి అంతా హైదరాబాద్ మీదనే పెట్టారు అని ఒక విమర్శ ఉంది.
By: Satya P | 12 Oct 2025 11:47 AM ISTఏ రంగంలో అయినా ఎవరైనా ఒక్కో మెట్టూ ఎక్కుతూ పైకి వస్తారు. కొన్ని సార్లు కసి ప్లస్ కృషి కలగలిపి వారు చాలా వేగంగానే ఎక్కువ మెట్లు ఎక్కుతారు. అయితే ఎక్కడైనా వైకుంఠపాళి ఉంటుంది, ఎగరేసే నిచ్చెనలతో పాటు పడదోసే పాములు కూడా ఉంటాయి. ఒక్కసారి పడినా నిరాశ పడకుండా ముందుకు సాగి తాము అనుకున్న లక్ష్యాలను సాధించిన వారిని గ్రేట్ అనాల్సిందే. ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణం చేసి గత పదహారు నెలలుగా కూటమి పెద్దగా పాలిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రమాణం తో మొదలెట్టి 2025 అక్టోబర్ 11 నాటికి అచ్చంగా 15 ఏళ్ళు పరిపూర్తి చేసుకున్నారు. అంటే ఏడాదికి 365 రోజులుగా తీసుకుంటే ఈ లెక్కన 15 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పాలనలో బాబు 5 వేల 475 రోజులు పూర్తి చేసుకున్నారు అన్న మాట. ఇది గ్రేట్ అచీవ్ మెంట్ గానే చూడాల్సి ఉంది.
అపర చాణక్యుడు :
బాబు అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన అపర చాణక్యుడు అనే. తిమ్మిని బమ్మిని చేసే సామర్థ్యం ఆయన సొంతం అని చెబుతారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కొత్త ఆలోచనలు చేస్తూ ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తుగా చేస్తూ తన వైపే అనేక సార్లు విజయం ఉండేలా చూసుకోవడంలో బాబు నేర్పరి అంటారు. ప్రత్యర్ధులు అయితే మభ్యపెట్టే రాజకీయాలు చేస్తారని విమర్శించవచ్చు. రాజకీయాలలో ఏదైనా వ్యూహాల కిందకే వస్తాయి కాబట్టి బాబు మాత్రం అపర చాణక్యుడు బిరుదాంకితుడే. ఇందులో డౌట్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు.
హైటెక్ సిటీ క్రియేటర్ :
ఇక బాబు అంటే మళ్ళీ గుర్తుకు వచ్చేది హైటెక్ సిటీ సృష్టి కర్తగా. ఆయన ఉమ్మడి ఏపీ సీఎం గా ఉండగా హైటెక్ సిటీ నిర్మాణంతో ఒక విధంగా అభివృద్ధికి బాటలు వేసారు. దాంతో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందింది. అంతే కాదు అప్పటికి నెమ్మదిగా దేశంలో విస్తరిస్తున్న సమాచార సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఏపీలో అందునా హైదరాబాద్ లో ఆయన చేసిన అనేక నిర్ణయాల ఫలితాలు ఇపుడు అందరికీ దక్కుతున్నాయి ఐటీ గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసిన సీఎం గా దానిని ఏపీలో అభివృద్ధి చేసిన నాయకుడిగా గుర్తుండిపోతారు.
ఏపీకి మాత్రం :
ఇవన్నీ పక్కన పెడితే ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు పాలించిన చంద్రబాబు ఆనాడు తన దృష్టి అంతా హైదరాబాద్ మీదనే పెట్టారు అని ఒక విమర్శ ఉంది. అది విమర్శ మాత్రమే కాదు నిష్టుర సత్యం కూడా. విభజన తర్వాత చూస్తే ఏపీలో ఒక్క విశాఖ తప్ప టైర్ టూ సిటీస్ కూడా ఏ ఒక్కటీ లేకుండా పోయాయి. దాంతో రాజధానిగా రెడీ మేడ్ గా ఫలనా నగరాన్ని ఎంపిక చేసుకుని పాలించాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే బాబు విభజన ఏపీకి తొలిసారి సీఎం అయ్యారు. ఆయన అమరావతిని రాజధానిగా చేస్తూ భూ సమీకరణతో వేలాది ఎకరాలను సేకరించారు. ఆ ప్రయత్నం సాగుతూండగానే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం ఒక పెద్ద ఇబ్బందిగానే ఆయన రాజకీయ జీవితంలో చూడలి.
కీర్తి శాశ్వతంగా :
ఇక విభజన ఏపీలో బాబు తలపెట్టిన అమరావతి రాజధాని అన్నది పూర్తి స్థాయిలో కాకపోయినా దశల వారీగా అయినా నిర్మాణం పరుగులు పెడితే మాత్రం అది బాబు ఘనత కిందకే వస్తుంది 2028 నాటికి ఒక రూపునకు తీసుకుని వస్తామని చెబుతున్నారు. రాజధాని అన్నది ఒక్క రోజులో రాదు, అది నిరంతర ప్రక్రియ. అందువల్ల ప్రభుత్వ భవనాలు కొన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం అయితే చాలు మిగతాది కాలం తో పాటే సాగుతుంది ఈ విధంగా కనుక బాబు తన నాలుగవ టెర్మ్ సీఎం పదవిలో పూర్తిగా సక్సెస్ అయితే ఆయన కీర్తి శాశ్వతం అవుతుంది. ప్రస్తుతం ఆ దిశగానే ఆయన ఆలోచనలు సాగుతున్నాయి.
ఆ రికార్డు బాబు పేరునే :
ఇదిలా ఉంటే బాబు 15 ఏళ్ళ సీఎం గా రికార్డుని క్రియేట్ చేయడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా బాబుని గ్రీట్ చేశారు. రానున్న కాలంలో మరింతగా అభివృద్ధి సాధించాలని కూడా ఆకాంక్షించారు. ఇక ఇప్పట్లో ఎవరూ ఇంతటి సుదీర్ఘమైన ముఖ్యమంత్రిత్వం చేయడం కంటే కష్టమే. ఆ రికార్డు బాబు పేరునే ఉండిపోతుంది అని కూడా చెప్పవచ్చు. మొత్తానికి బాబు పదిహేనేళ్ళు సీఎం గా పరిపూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు.
