Begin typing your search above and press return to search.

బాబు మంత్రం: వివాదాన్ని తుంచారా? పెంచారా?

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Garuda Media   |   11 Nov 2025 6:00 PM IST
బాబు మంత్రం: వివాదాన్ని తుంచారా? పెంచారా?
X

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి మ‌రిన్ని బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు. ఎమ్మెల్యేల బాధ్యతను మంత్రులే తీసుకోవాలని.. ముఖ్యంగా జిల్లాలకు ఇన్చార్జిలుగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలను దారిలో పెట్టాలని సూచించారు. పూర్తిస్థాయిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను దారిలో పెట్టాలని వారికి అవగాహన లేకపోతే అవగాహన కల్పించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

నిజానికి అసలు సమస్య అంతా ఇన్చార్జి మంత్రులతోనూ.. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతోనే ఉన్న విషయం మంత్రుల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎందుకంటే ఇన్చార్జి మంత్రులతో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు తీవ్ర వివాదాలను నడుస్తున్నాయి. ఇన్చార్జి మంత్రులు సమావేశాలు పెట్టినా ఎమ్మెల్యేలు రాని పరిస్థితి కర్నూలు, కడప, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లా, అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇటీవల కాలంలో కనిపించింది. దీనిపై పెద్ద ఎత్తున ఇన్చార్జి మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు కూడా చేశారు.

తాము సమావేశాలు పెడుతున్నామని.. కానీ, కలెక్టర్లు సహా ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రాకుండా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆయనకు చెప్పారు. పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు ఇన్చార్జి మంత్రులకు బాధ్యతలు అప్పగించి ప్రయోజనం ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి ఇన్చార్జి మంత్రుల మాట ఎమ్మెల్యేలు వినే పరిస్థితిలో ఉన్నారా .. అసలు స్థానికంగా ఏం జరుగుతోంది అనే విషయాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెడితే తప్ప పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అనేక లోపాలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు.

ఉదాహరణకు శ్రీకాకుళం ఇన్చార్జి మంత్రిగా ఉన్న హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఇటీవల సమావేశం నిర్వహించినపుడు పార్టీకి చెందిన నాయకులు డుమ్మా కొట్టారు. దీంతో చాలా సేపు ఎదురు చూసి సమావేశాన్ని ముగించుకుని ఆమె వెళ్లిపోయారు. ఇక, కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఇంకా దారుణంగా ఉందనే వాద‌న వినిపిస్తోంది. అసలు సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఎవరు టీజీ భరత్ మాట వినడం లేదన్నది వాస్తవమ‌ని చెబుతున్నారు.మరి ప‌రిస్థితి ఇలా ఉన్నప్పుడు ఇన్చార్జి మంత్రులకు ఇప్పుడు కొత్తగా బాధ్యతలు అప్పగించి.. సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారన్నది చూడాలి.