ఆ ఏపీ మంత్రులు.. ఆదాయం పెంచుతున్నారు.. !
ప్రజలపై భారం : ఆదాయాన్ని పెంచాలన్న వ్యూహంతో గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసింది.
By: Garuda Media | 6 Nov 2025 10:01 AM ISTఅవును నిజం!. మంత్రులు కూడా రాష్ట్ర సర్కారు ఆదాయం పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది.. అనుకుంటే.. వచ్చిన.. వస్తున్న ఆదాయం కేవలం.. 35-55 రూపాయ ల మధ్యే ఉందన్నది వాస్తవం. దీంతో ఆదాయ మార్గాల పెంపు.. తద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే విషయాలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు మార్గాల ద్వారా ఆదాయ అన్వేషణ చేస్తున్నారు. అయితే..దీనిలోనూ ప్రధానంగా మూడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
1) ప్రజలపై భారం : ఆదాయాన్ని పెంచాలన్న వ్యూహంతో గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసింది. దీంతో ప్రజలు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో ఎలాపడితే అలా ప్రజలపై భారాలు వేయరాదన్నది సీఎం ఆలోచన. అదేసమయంలో మద్యం ధరలను పెంచి గత వైసీపీ ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. ఇది కూడా సరికాదన్నది సీఎం చంద్రబాబు ఆలోచన.
2) పన్నుల పెంపు: ప్రస్తుతం ఈ విషయంపైనే ఎక్కువగా ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. అయితే.. ఇప్పటికే ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలను ఒకసారి పెంచారు. దీంతో మరోసారి పెంచితే.. ప్రజలు ఇబ్బంది పడతారన్న ఆలోచనలో సర్కారు ఉంది. దీంతో ఈ వ్యవహారాన్ని కూడా పక్కన పెట్టారు. అదేసమయంలో ఇతర పన్నులు పెంచాలన్న ఆలోచన ఉన్నా.. వాటి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే.. దానిని వద్దని తేల్చి చెప్పారు.
3) సేవా రుసుములు: దీనినే సర్వీసు చార్జీలు అంటున్నారు. వీటిని పెంచేందుకు కూడా సర్కారు ఇష్టపడడం లేదు. సేవా రుసుములు ఇప్పటికే మునిసిపాలిటీల్లో వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని చేకూర్చేలా మంత్రుల కమిటీని చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం కమిటీ జిల్లాల వారీగా ప్రయత్నాలు చేస్తోంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, పయ్యావుల కేశవ్‌లు.. ఈ పనిపైనే ఉన్నారు. దీంతో ప్రస్తుత వస్తున్న ఆదాయాన్ని కనీసంలో కనీసం 20 శాతం వరకు పెంచాలన్నది ఆలోచన. మరి ఎలా సూచిస్తారో చూడాలి.
