యోగి మాదిరిగా చంద్రబాబు.. నెల్లూరు ఎపిసోడ్ చెబుతోంది ఇదేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అరాచక శక్తుల పాలిట సింహస్వప్నంలా పనిచేస్తోందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 2 Dec 2025 4:50 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అరాచక శక్తుల పాలిట సింహస్వప్నంలా పనిచేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రౌడీలు, గ్యాంగస్టర్ల విషయంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మాదిరిగా చంద్రబాబు యాక్షన్ ఉంటోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రాగానే గంజాయి ముఠాలు ఆటకట్టేలా చర్యలు తీసుకున్న చంద్రబాబు.. ఇంకా అక్కడక్కడ అరాచకంగా ప్రవర్తిస్తున్న వారి తాట తీసేలా అడుగులు వేయడమే సంచలనం రేపుతోంది. ఇక మహిళలు, ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి అదే చివరి రోజు అవుతుందన్న చంద్రబాబు వార్నింగు అమలు అవుతోన్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. తాజాగా నెల్లూరులో గంజాయి డాన్ అరవి కామక్షికి చెందిన ఐదు ఇళ్లు కూల్చివేత పెను సంచలనంగా మారింది. ప్రజల రక్తాన్ని పీల్చి కామక్షి కట్టుకున్న ఇల్లు అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ సంఘటన ద్వారా అరాచకశక్తులకు రాష్ట్రంలో స్థానం లేదన్న సంకేతాలు పంపినట్లు అయిందని అంటున్నారు.
ఒక్క కామాక్షే కాదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ, దౌర్జన్యాలు, ఆడవాళ్లపై ఆకృత్యాలకు ఒడిగట్టేవారిపై వెనువెంటనే శిక్షలు పడుతున్నాయని చెబుతున్నారు. తునిలో ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడు చెరువులో శవంగా తేలడం కూడా ఇందులో భాగంగానే చెబుతున్నారు. ప్రజల క్షేమాన్ని కోరుతూ చంద్రబాబు సర్కారు తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నవారు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పోల్చుతున్నారు. యూపీలో సీఎం అయిన వెంటనే యోగి తీసుకున్న అనేక చర్యలు ఆ రాష్ట్రంలో అరాచక శక్తులను అణచివేసినట్లు చెబుతున్నారు. అయితే ఏపీలో యూపీ అంతలా పరిస్థితులు లేకపోయినా, ప్రమాదకరంగా మారిన గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచులు, ఆడపిల్లలపై ఆకృత్యాలకు ఒడిగట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.
అందుకే గతంలో ఎన్నడూ లేనట్లు చంద్రబాబు 4.0 పానలో అర్థరాత్రి షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారని అంటున్నారు. గత నెలలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని అత్యాచారయత్నం కేసులో నిందితుడు అర్ధరాత్రి పూట శవంగా మారి చెరువులో తేలాడు. ఆ ఘటన తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం, పోలీసులు చెప్పిన అంశాలను అంతా ఆమోదించారు. విపక్షం కూడా ఈ విషయాన్ని తప్పుపట్టేలా మాట్లాడలేకపోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో ఆ తరహా నేరాలకు పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందనే సంకేతాలను ప్రభుత్వం గట్టిగా పంపినట్లైందని అంటున్నారు. ఇక తాజాగా నెల్లూరులో గంజాయి డాన్ కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను అర్ధారాత్రి కూల్చివేశారు.
స్థానిక ప్రజలే ఆగ్రహంతో కూల్చేశారని అంటున్నా.. దీనికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకపోవడం, తెల్లారిన తర్వాతే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడం వెనుక ప్రభుత్వం పక్కా వ్యూహం ఉందని అంటున్నారు. గంజాయి అమ్మకాలతో సవాల్ విసరడమే కాకుండా, ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన లేడీ డాన్ కామాక్షికి తగిన గుణపాఠం చెప్పాలనే కాన్సెప్టే ఇందులో ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు. అర్ధరాత్రి పూట ఐదు ఇళ్లను ఏకకాలంలో ఒక కాలనీ ప్రజలు కూల్చేశారంటే నమ్మశక్యంగా లేదని, ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉన్నా అదృశ్య హస్తం అండతోనే ఈ పని జరిగిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో కూల్చివేతలనే అంతా ఆమోదిస్తుండటం వల్ల ఎలాంటి విమర్శలు వినిపించలేదని అంటున్నారు.
ఏపీలో ఈ తరహా షాక్ ట్రీట్మెంట్లు పూర్తి కొత్తగా ఉన్నాయంటున్నారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టైపులో చంద్రబాబు ఇంతటి సీరియస్ గా నిర్ణయాలు తీసుకోవడంపై హాట్ డిబేట్ జరుగుతోంది. సాధారణంగా అరాచకశక్తుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగానే ఉంటారని అంటున్నారు. మావోయిస్టులు, హైదరాబాద్ మతకలహాలు, రాయలసీమ ఫ్యాక్షన్ పై గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఉదహరిస్తున్నాయి. అయితే అప్పుడు పూర్తిగా చట్టబద్దమైన రీతిలో శిక్షలు వేసేలా చర్యలు తీసుకునేవారని, కానీ ఇప్పుడు మారిన లోకానికి తగ్గట్టు స్పీడుగా శిక్షలు పడేలా చంద్రబాబు చర్యలు తీసుకోవడంపైనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యోగి టైపులో చంద్రబాబు నడుస్తున్న తీరు వల్ల ఏపీలో చిన్నచిన్న తప్పులకు ఇకపై పెద్ద శిక్షలు ఉంటాయనే సంకేతాలు పంపుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
