బాబు, పవన్ భేటీ.. బాలయ్య వ్యాఖ్యల తరువాత తొలిసారి... ఏం జరిగిందంటే...?
నిజానికి పవన్ ను పరామర్శించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశమే అయినా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇద్దరి నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Tupaki Political Desk | 29 Sept 2025 1:35 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్ ను హైదరాబాద్ లో ఆయన నివాసంలో చంద్రబాబు కలిశారు. జ్వర తీవ్రతపై అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అమరావతికి వచ్చిన పవన్ గత వారం తీవ్ర జ్వరంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఇక రెండు రోజుల పాటు తీవ్ర జ్వరంతోనే అసెంబ్లీకి వెళ్లిన పవన్.. ఎంతకూ తగ్గకపోవడంతో విశాంత్రి నిమిత్తం హైదరాబాద్ వచ్చేశారు. ఇక అదివారం కావడంతో చంద్రబాబు సైతం హైదరాబాద్ వచ్చి నేరుగా పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
నిజానికి పవన్ ను పరామర్శించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉద్దేశమే అయినా ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఈ ఇద్దరి నేతల భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లగా, బయటకు వచ్చి మరీ చంద్రబాబుకు పవన్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు చాలా సేపు చర్చించుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు అకాంక్షించారు. కాగా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీ మధ్య కేవలం వ్యక్తిగత అంశాలే చర్చకు వచ్చాయా? లేక తాజా రాజకీయ పరిణామాలపై ఏమైనా చర్చ జరిగిందా? అనే చర్చ సాగుతోంది.
గత సోమవారం నుంచి పవన్ జ్వరంతో బాధపడుతుండగా, రెండు రోజులు అమరావతిలోనే పవన్ ఉన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చేయగా, ఆ తరువాత అసెంబ్లీలో టీడీపీ ముఖ్యనేత, హిందూపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు బావ మరిది నందమూరి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో ప్రస్తావిస్తూ ఆ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం వల్ల అప్పటి ముఖ్యమంత్రి దిగివచ్చారని చెప్పారు. అయితే దీనిపై బాలయ్య అభ్యంతరం చెబుతూ, అప్పట్లో ఎవడూ గట్టిగా మాట్లాడలేదని తేల్చిచెప్పారు.
గత ప్రభుత్వంలో సినీ రంగం పెద్దగా చిరంజీవి పాత్ర పరిమితం అన్నట్లు బాలయ్య వ్యాఖ్యానించడం ఆయన అభిమానులను ఆవేదనకు గురిచేసింది. అంతేకాకుండా మిత్రపక్షం జనసేనను షాక్ కు గురిచేసింది. ఇక బాలయ్య మాటలను అదునుగా చేసుకుని వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరూ ఆ అంశంపై మాట్లాడకుండా కట్టడి చేశారు. అదే సమయంలో జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ సైతం తమ పార్టీ నుంచి ఎవరూ మాట్లాడకుండా అదుపు చేయడంతో బాలయ్య వ్యాఖ్యల తుఫాన్ చప్పున చల్లారిపోయింది. అయితే ఈ విషయంలో పవన్ తో చంద్రబాబు ఏం చెప్పి ఉంటారన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. బాలయ్య వ్యాఖ్యల దుమారం తర్వాత ఇద్దరు నేతలు తొలిసారి భేటీ కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.
