చీపురు పట్టిన చంద్రన్న.. మరి తమ్ముళ్ల మాటేంటి?
ఈ క్రమంలో ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పర్యటిస్తున్నారు.
By: Garuda Media | 20 Sept 2025 9:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చీపురు పట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి నెల మూడో శనివారాన్ని `స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర` శనివారంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం.. రాష్ట్రస్థాయిలో పరసరాలను పరిశుభ్రం చేసుకునేందుకు కేటాయించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధు లు సహా కార్యకర్తలు కూడా పాల్గొనాలని గతంలోనే సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.. వలంటీర్లు కూడా పాల్గొనాలని తెలిపారు.
ఈ క్రమంలో ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పర్యటిస్తున్నారు. చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివా రం ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు, ఉత్కంఠకు కూడా మాచర్ల నియోజకవర్గం కేరాఫ్ అనే విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని చెరువు ప్రాంతంలో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానికులతోపాటు.. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. త ర్వాత ఆయన ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. అదేవిధంగా ని యోజకవర్గంలోని పీ-4 పథకానికి అర్హులైన వారితోనూ భేటీ అవుతారు.అనంతరం బహిరంగ సభలోనూ పాల్గొంటారు. గత నెలలోనూ కూడా సీఎం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఇక, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి ఉంది.
ఎంత మంది పాల్గొంటున్నారు?
సీఎం చంద్రబాబే స్వయంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టు కుంటున్నా.. ఆయన చెబుతున్నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్న వారు కొందరు అయితే.. అసలు తమకు ఏమీ సంబంధం లేదని భావించేవారు మరింత మంది ఉన్నారు. దీంతో చంద్రబాబు ఆశయం.. కేవలం ఆయన చుట్టూనే తిరుగుతోంది. వాస్తవానికి కూటమి పార్టీలకు కూడా చంద్రబాబు ఇదే పిలుపునిచ్చారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి. అయినా.. చంద్రబాబు మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు.
