Begin typing your search above and press return to search.

పార్టీ పదవులపై తుది కసరత్తు.. లోకేశ్ పదవిపై నేడే ప్రకటన?

ముఖ్యమంత్రి షెడ్యూల్ లో ఈ రోజు మూడు గంటల పాటు పార్టీ కార్యక్రమాలకే కేటాయించడంతో పార్టీ కార్యవర్గంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   18 Oct 2025 3:42 PM IST
పార్టీ పదవులపై తుది కసరత్తు.. లోకేశ్ పదవిపై నేడే ప్రకటన?
X

అధికార తెలుగుదేశం పార్టీలో సంస్థాగత పదవుల పంపకంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. గత ఏప్రిల్ నెలలోనే పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియ అనేక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీంతో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేల్చేయాలని డిసైడ్ అయిన పార్టీ అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్లతో చర్చలకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి షెడ్యూల్ లో ఈ రోజు మూడు గంటల పాటు పార్టీ కార్యక్రమాలకే కేటాయించడంతో పార్టీ కార్యవర్గంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

ఏటా మే నెలలో నిర్వహించే మహనాడులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ప్రకటన ఉంటుంది. మే నెలకు ముందుగానే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించి మహానాడులో వాటికి ఆమోదిస్తారు. ఇక మహానాడుకు హాజరయ్యే ప్రతినిధులు రాష్ట్ర, జాతీయ కమిటీలను ఎన్నుకుంటారు. గత 30 ఏళ్లుగా పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత మే నెలలో జరిగిన మహానాడులో అధినేత చంద్రబాబును మరోమారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక రాష్ట్ర కమిటీల ఎంపిక బాధ్యతను అధ్యక్షుడికే అప్పగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ సారి రాష్ట్ర కమిటీ ఎంపికకు మరో అడ్డంకి కూడా ఉందని అంటున్నారు. జిల్లా కమిటీల ఎంపిక పూర్తికాకపోవడంతో రాష్ట్ర కమిటీ నియామకం సాధ్యమవలేదని అంటున్నారు.

పార్టీ అధికారంలో ఉండటం, గతం కన్నా సంస్థాగతంగా బలం పుంజుకోవడం, మరో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ జిల్లా అధ్యక్షుల పదవులకు డిమాండ్ ఏర్పడింది. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, జైళ్లకు వెళ్లినవారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని అధిష్టానం సూచించింది. అయితే జిల్లాల్లో పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. గతంలో ఇబ్బందులను అధిగమించి పోరాడిన వారు కన్నా, తమ మాటకు విలువనిచ్చేవారిని జిల్లా అధ్యక్షులుగా నియమించుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. దీంతో మెజార్టీ జిల్లాల్లో సంస్థాగత కమిటీల ఎంపిక కొలిక్కిరాలేదు. జిల్లాల్లో సమన్వయం సాధించడానికి పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవిత, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించారు. అయితే వీరి మధ్యవర్తిత్వం కూడా పనిచేయకపోవడంతో చాలా జిల్లాల్లో కమిటీల ఎంపిక పూర్తికాని పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితుల్లో అధినేత చంద్రబాబు పార్టీపై ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ కమిటీల ఎంపిక కోసమే ఆయన కసరత్తు చేయనున్నారని, అందుకే ప్రభుత్వ పనులు అన్నీ పక్కన పెట్టి పార్టీకి 3 గంటల సమయం కేటాయించారని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీ కోసం ఇంత సమయం కేటాయించలేదని నేతలు గుర్తుచేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీతోపాటు పేచీగా మారిన జిల్లా కమిటీలపైనా ఈ రోజు ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీకి భావి నేతగా పగ్గాలు చేపట్టున్న యువనాయకుడు లోకేశ్ పదవిపైనా ఈ రోజే నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.

మహానాడు సమయంలోనే యువనేత లోకేశ్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంటుగా నియమించాలని డిమాండ్ వినిపించింది. పార్టీ భావి నేతగా లోకేశ్ ను ప్రమోట్ చేయాలంటే ఇప్పుడే ఆయనకు బాధ్యతలు బదిలీ చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఇంతవరకు వర్కింగు ప్రెసిడెంట్ పదవి లేకపోవడంతో కొత్తగా నియామకంపై ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగానే మహానాడులో లోకేశ్ పదవిపై ప్రకటన చేయలేదని అంటున్నారు. అయితే మహానాడు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార విధుల్లో బిజీ అయిపోవడంతో లోకేష్ పదవిపై ప్రకటన కూడా తెరమరుగైంది. ఇక ఈ రోజు పార్టీ కమిటీలపై కసరత్తు మొదలుపెట్టనందున వర్కింగు ప్రెసిడెంటుగా లోకేశ్ నియామకంపైనా తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. దీపావళి సందర్భంగా ఈ ప్రకటన ఉంటుందా? లేక మరో మంచి ముహూర్తం చూసుకుని ప్రకటిస్తారా? అనేదే సస్పెన్ష్ గా మారింది.